- 24న ఎదుర్కోలు, 25న కల్యాణం, 26న రథోత్సవం
- 11 రోజుల పాటు ఆర్జిత సేవలు తాత్కాలికంగా రద్దు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారం ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు 28 వరకు 11 రోజుల పాటు కొనసాగనున్నాయి. 18న విశ్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురారోపణం పూజలతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 24న స్వామివారి ఎదుర్కోలు, 25న తిరుకల్యాణ మహోత్సవం, 26న దివ్యవిమాన రథోత్సవం నిర్వహించనున్నారు.
28న నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 11 రోజుల పాటు ఆర్జిత సేవలైన నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహహోమం, బ్రహ్మోత్సవం వంటి పూజలను తాత్కాలికంగా రద్దు చేశారు. 29 నుంచి ఈ సేవలను పునరుద్ధరించనున్నట్లు ఈవో భవానీ శంకర్ తెలిపారు.
బ్రహ్మోత్సవాల కోసం ముమ్మర ఏర్పాట్లు
ఈ నెల 18 నుంచి యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాలు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, ఆలయాన్ని ముస్తాబు చేసే పనుల్లో ఆఫీసర్లు నిమగ్నమయ్యారు. ప్రధానాలయ ముఖ మంటపం, హనుమాన్ టెంపుల్, ఆండాళ్ అమ్మవారి ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరిస్తుండగా, సప్తగోపుర ప్రధానాలయ సముదాయానికి ప్రత్యేక లేజర్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు.
యాదగిరిగుట్టకు వచ్చే ప్రధాన రహదారులతో పాటు పట్టణంలో స్వాగత తోరణాలు, ఆర్చిల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రధానాలయాల నుంచి యాదగిరిగుట్టకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది.
హైదరాబాద్ నుంచి బయలుదేరిన జ్యోతియాత్ర
యాదగిరిగుట్ట ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్ బర్కత్‌పురలోని యాదగిరిభవన్ నుంచి ఆదివారం నారసింహుడి ‘అఖండజ్యోతి యాత్ర’ ప్రారంభమైంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి జ్యోతిని వెలిగించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం యాత్రను ప్రారంభించారు. లక్ష్మీనరసింహుల విగ్రహాలతో బర్కత్‌పురలో మొదలైన యాత్ర వైఎంసీఏ నారాయణగూడ నుంచి విద్యానగర్, రామంతాపూర్, హబ్సిగూడ, ఉప్పల్, నారపల్లి, ఘట్‌కేసర్, బీబీనగర్, భువనగిరి, రాయగిరి మీదుగా ఈ నెల 18న రాత్రి 8 గంటల వరకు యాదగిరిగుట్ట చేరుకోనుంది.
గుట్టకు వచ్చాక లక్ష్మీనరసింహుల విగ్రహాలను యాదగిరిగుట్ట దేవస్థానానికి అప్పగిస్తామని యాత్ర చైర్మన్ సద్ది వెంకట్‌రెడ్డి చెప్పారు. వైకుంఠ ద్వారం వద్ద లక్ష్మీనరసింహుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. రాత్రి 10 గంటలకు స్వామి అమ్మవార్ల విగ్రహాలను రాయగిరి చెరువులో నిమజ్జనం చేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్‌శర్మ పాల్గొన్నారు.
