- బీఆర్‌ఎస్‌లో చేరిన ఇద్దరు కౌన్సిలర్లకు గాలం
- అభివృద్ధి కోసం అధికార పార్టీతో కలిసి పనిచేస్తానన్న బీజేపీ కౌన్సిలర్
- హస్తం క్యాంపులో చేరిన నలుగురు ఇండిపెండెంట్లు
బెల్లంపల్లి, వెలుగు : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీని దక్కించుకునేందుకు కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. మున్సిపాలిటీలో మొత్తం 34 వార్డులు ఉండగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చెరో 14 వార్డుల్లో గెలిచాయి. ఐదు స్థానాల్లో ఇండిపెండెంట్లు, మరో స్థానంలో బీజేపీ క్యాండిడేట్ గెలిచారు. సమాన సీట్లు సాధించిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చైర్‌పర్సన్ సీటు కోసం పోటాపోటీగా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 26వ వార్డులో కాంగ్రెస్ నుంచి గెలిచిన కుమారస్వామితో పాటు 34వ వార్డులో బీజేపీ నుంచి గెలిచిన కొక్కుల రామ్మూర్తి శనివారం కేటీఆర్‌ను కలిసి బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ శ్రేణులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.
ముగ్గురు కౌన్సిలర్లు బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడానికి 28వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ చిప్ప అర్చన భర్త మనోహరే కారణమని గుర్తించిన కాంగ్రెస్ లీడర్లు.. బీఆర్‌ఎస్‌కు బ్రేకులు వేసేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా నలుగురు ఇండిపెండెంట్లను తమవైపునకు తిప్పుకోగా.. బీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ కౌన్సిలర్ కొక్కుల రామ్మూర్తిని సైతం కాంగ్రెస్ శిబిరానికి తీసుకొచ్చినట్లు సమాచారం. చిప్ప మనోహర్ చొరవతో బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన 26వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ కుమారస్వామి సైతం తిరిగి కాంగ్రెస్ శిబిరానికి చేరినట్లు తెలిసింది.
కాంగ్రెస్ నుంచి 14 మంది గెలువగా.. ఇందులో మనోహర్ భార్య అర్చనను కాంగ్రెస్ పార్టీ పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆ పార్టీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు, నలుగురు ఇండిపెండెంట్లు, బీజేపీ కౌన్సిలర్‌తో పాటు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎక్స్ అఫీషియో ఓటుతో కాంగ్రెస్ బలం 19కి చేరుకుంది. దీంతో కాంగ్రెస్‌కు పూర్తిస్థాయి బలం చేకూరడంతో బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానం ఆ పార్టీకే దక్కడం ఖాయమైంది.
అధికార పార్టీతో కలిసి పనిచేస్తా : కొక్కుల రామ్మూర్తి, బీజేపీ కౌన్సిలర్
తాను బీఆర్‌ఎస్‌లో చేరినట్లు వస్తున్న వార్తలు అసత్యమని బెల్లంపల్లి మున్సిపాలిటీ 34వ వార్డు బీజేపీ కౌన్సిలర్ కొక్కుల రామ్మూర్తి స్పష్టం చేశారు. తాను బీజేపీలోనే కొనసాగుతున్నానని చెప్పారు. కానీ వార్డు అభివృద్ధి కోసం అధికార పార్టీతో కలిసి పనిచేసేందుకు నిర్ణయించుకున్నానని ప్రకటించారు.
