ఈ లక్షణాలుంటే థైరాయిడ్ కావచ్చు.. త్వరగా గుర్తించండి!

ఈ లక్షణాలుంటే థైరాయిడ్ కావచ్చు..  త్వరగా గుర్తించండి!

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వెంటనే తెలుస్తాయి. మరికొన్ని నెమ్మదిగా బయటపడతాయి. కానీ, థైరాయిడ్ లాంటి సమస్యలు మాత్రం కనుక్కోవడం అంత ఈజీ కాదు. నిజానికి థైరాయిడ్ సమస్యను సింపుల్​ టెస్ట్‌‌ ద్వారా కనిపెట్టొచ్చు. ఎలాంటి లక్షణం కనిపించినా డాక్టర్ సలహా మేరకు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మరెందుకు త్వరగా గుర్తించలేక పోతున్నారంటే.. దీని లక్షణాల వల్లే. అవేంటో ఈ కథనంలో తెలుసుకోండి.

థైరాయిడ్ అనేది గొంతు భాగంలో ఆడమ్స్ ఆపిల్ కింద, వాయునాళానికి ముందు ఉన్న ఎండోక్రైన్ గ్రంథి. ఇది చూడటానికి సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. ఈ గ్రంథి శరీరంలో జీవక్రియలకు ఉపయోగపడే ముఖ్యమైన హార్మోన్లను విడుదల చేస్తుంది. జీవక్రియ మొదలుకుని గుండె కొట్టుకోవడం వరకు.. దాదాపు అన్ని బాడీ ఫంక్షన్లలో పాల్గొంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి గురించి శ్రద్ధ తీసుకోవాలి. శరీరంలో తగినంత థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి లేకపోతే హైపో థైరాయిడిజం, హార్మోన్ అధికంగా ఉత్పత్తి అయితే హైపర్ థైరాయిడిజం సమస్యలు వస్తాయి. 

శరీరంలో థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయా లేదా తక్కువగా ఉన్నాయా అనే దానిపై ఆధారపడి సమస్యల లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి. అయితే, మగవాళ్ల కంటే ఆడవాళ్లలోనే థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ఎనిమిది మంది మహిళల్లో ఒకరు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా థైరాయిడ్ సమస్యను ఎదుర్కొంటారని కొన్ని రిపోర్ట్లు చెప్తున్నాయి. వయసు, శరీర రకం, శరీరంలోని థైరాయిడ్ హార్మోన్ పరిమాణం వంటి అంశాలపై ఆధారపడి కొంతమందిలో థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

అంతా బాగుందనుకున్నా..

లక్షణాలు లేకపోయినా టెస్ట్ చేయించడం తప్పనిసరి. పెండ్లికి ముందు లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవాళ్లు టీఎస్​హెచ్, ఫ్రీ టీ4, టీపీఓ యాంటిబాడీస్ చెక్ చేయించుకోవాలి. ప్రెగ్నెన్సీ మొదటి నెలలో కూడా స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల తల్లీబిడ్డ క్షేమంగా ఉంటారు. వయసు పైబడిన వాళ్లలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ గుర్తించడం కాస్త కష్టమవుతుంది. ఎందుకంటే వాళ్లలో కనిపించే అలసట, మెటబాలిజం నెమ్మదించడం, బరువు పెరగడం లేదా తగ్గడం, మూడ్ మారిపోవడం వంటివి వయసురీత్యా వస్తున్నాయని భ్రమపడే అవకాశం ఉంది. అందువల్ల వాళ్లలో ఈ సమస్యను త్వరగా కనుక్కోలేకపోతారు. 

అందుకే వయసు అరవై దాటాక ఏడాదికొకసారి థైరాయిడ్ స్క్రీనింగ్ తప్పనిసరి. అలాగే, మిడిలేజ్​లో ఉండి ఆరోగ్యంగా ఉన్నవాళ్లలో కూడా కొన్నిసార్లు గుర్తించడం కష్టమవుతుంది. టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ నార్మల్​గా ఉండి గొంతు ముందు భాగంలో గడ్డ లాగ లేక వాపు లాగ ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. అది కొన్నిసార్లు థైరాయిడ్ క్యాన్సర్ లక్షణం అయ్యుండొచ్చు. కాబట్టి వెంటనే గొంతు స్కాన్ చేయించడం, అవసరమైతే ఆ వాపు నుంచి సూది ద్వారా శాంపిల్ తీసి పరీక్ష చేయడం మంచిది. థైరాయిడ్ క్యాన్సర్ చాలా రకాలుగా ఉంటుంది. త్వరగా గుర్తించి చికిత్స అందిస్తే, పూర్తి సాధారణ జీవితం గడిపే అవకాశం ఉండొచ్చు. అదే ఆలస్యం జరిగితే పరిస్థితి చేయి జారే ప్రమాదం ఉంది. 

చివరిగా సమస్యను సరిగ్గా గుర్తించి మందును సరైన మోతాదులో వాడుతూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి పరీక్ష చేసుకుంటూ వైద్యుల పర్యవేక్షణలో ఉండడం అనేది థైరాయిడ్ లాంటి దీర్ఘకాలిక జబ్బుల విషయంలో చాలా ముఖ్యం. థైరాయిడ్ రక్త పరీక్ష రిపోర్ట్ ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు గత నెలలో కొన్ని రోజులు మందులు వేసుకోకపోయినా ఈ మధ్య కాలంలో ఏమైనా ఇన్ఫెక్షన్ లేక జ్వరం వచ్చినా ల్యాబ్ నమ్మకమయినది కాకపోయినా ఆ రిపోర్ట్‌‌‌‌తో ఎలాంటి నిర్ధారణకు రాలేము. కాబట్టి లక్షణాలను బట్టి డాక్టర్ సూచించిన చికిత్స తీసుకోవాలి.

ఈ గ్రంథి ఏం చేస్తుంది?

థైరాయిడ్ గ్రంథి ఎండోక్రైన్ వ్యవస్థలో భాగం. ఇది శరీర జీవక్రియ ప్రక్రియలకు సాయపడే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది మెదడు అభివృద్ధి, గుండె, కండరాల పనితీరు, ఎముక, రక్త సాంద్రతను కూడా కంట్రోల్ చేస్తుంది. దీని పనితీరు ఆహారం నుంచి గ్రహించిన అయోడిన్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. 

హైపో థైరాయిడ్

నీరసం, మలబద్దకం, చర్మం, వెంట్రుకలు పొడిబారడం, ఎక్కువ నిద్ర, బరువు పెరగడం, నెలసరిలో రక్తస్రావం ఎక్కువగా లేక తక్కువగా అవ్వడం, గర్భస్రావం, చలిని తట్టుకోలేక పోవడం, గుండె తక్కువసార్లు కొట్టుకోవడం, జుట్టు రాలడం, థైరాయిడ్ గ్రంథి వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

హైపర్ థైరాయిడ్ 

ఆకలి ఎక్కువ అవ్వడం, బరువు తగ్గడం, చెమటలు ఎక్కువ పట్టడం, చిరాకు, స్థిమితం లేకపోవడం, నిద్ర లేమి, నీరసం, ఎక్కువసార్లు విరేచనం అవ్వడం, నెలసరిలో రక్తస్రావం తక్కువగా అవ్వడం, వేడిని తట్టుకోలేక పోవడం, గొంతు ముందు వాపు, గుండె దడ అనిపించడం, కళ్లు పెద్దవిగా అవ్వడం, చేతులు వణకడం వంటివి కనిపిస్తాయి.