స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై కూడా

స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై కూడా
  •     తీన్మార్ మల్లన్న తరఫున త్వరలో సీఎం ప్రచారం!
  •     ఆ తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ప్లాన్
  •     వచ్చేనెల 6న ముగియనున్న ఎంపీ ఎన్నికల కోడ్​ 
  •     ఆ వెంటనే మూడు నెలల పాటు స్థానిక ఎన్నికల కోలాహలం

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు కాంగ్రెస్ దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. ఎంపీ ఎన్నికల కోడ్​ ముగియగానే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. వీటిలో క్లీన్​ స్వీప్​ చేయాలని కాంగ్రెస్​ ప్రయత్నిస్తున్నది. అందుకు తగ్గట్టుగా పల్లెల్లో పార్టీ తరఫున ప్రోగ్రామ్స్​ను స్టార్ట్​ చేయాలని భావిస్తున్నది. అయితే, ఈ లోకల్ బాడీ ఎన్నికలకు ముందు

నల్గొండ–ఖమ్మం–వరంగల్​ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత పీసీసీ చీఫ్​గా సీఎం రేవంత్​రెడ్డిపై పడింది. గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27 జరగనుంది. త్వరలోనే  కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం సీఎం రేవంత్​రెడ్డి ప్రచారానికి వెళ్లే అవకాశం ఉంది.  

వరుసగా స్థానిక సంస్థలకు ఎన్నికలు

గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తవగానే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పటికే సర్పంచ్​ల పదవీకాలం పూర్తయింది. మరో రెండు నెలల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగియనుంది. ఆ తర్వాత మున్సిపల్ మేయర్, చైర్​పర్సన్​, కౌన్సిలర్, కార్పొరేటర్ల పదవీకాలం పూర్తికానుంది. రాబోయే మూడు నెలల్లోనే లోకల్ బాడీలకు వరుస ఎన్నికలు నిర్వహిస్తే మిగతా నాలుగున్నరేండ్లు పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి పెట్టవచ్చని సీఎం రేవంత్​రెడ్డి భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో స్పష్టం చేశారు.

ఎంపీ ఎన్నికల సందర్భంలో కూడా పార్టీ క్యాడర్​కు దీనిపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడితే, అలాంటి వారికి ఆ వెంటనే జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తామని పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ చెప్పారు. ఎంపీ ఎన్నికల కోడ్ ముగియగానే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. సర్పంచ్​ల ఎన్నిక పార్టీల గుర్తుపై జరగకపోయినా, పార్టీలో పనిచేస్తున్న చురుకైన కార్యకర్తలను గెలిపించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించనుంది.  ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పార్టీ పరంగా జరగనున్నందున కాంగ్రెస్​లో చురుకైన గ్రామ

మండల స్థాయి నాయకులకు టికెట్లు ఇచ్చి మెజార్టీ మండల పరిషత్​లను, అదే విధంగా మెజార్టీ జిల్లా పరిషత్​లను ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్​ భావిస్తున్నది.  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలపై ఇప్పటి నుంచి పల్లెల్లో విస్తృత ప్రచారం చేయాలని కాంగ్రెస్​ పార్టీ యోచిస్తున్నది. పల్లెల్లో పార్టీ పరమైన ప్రోగ్రామ్ లను స్పీడప్ చేయాలని పీసీసీ చూస్తున్నది.

మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేలా ప్లాన్​ 

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తి కాగానే  మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర సర్కారు అనుకుంటున్నది. పట్టణాల అభివృద్ధిలో ఇవి కీలకమైనందున ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు రేవంత్​కు ప్రతిష్టాత్మకం కానుంది. అందుకే మెజార్టీ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకునేలా ఇప్పటి నుంచి పట్టణ స్థాయిలో పార్టీ పరమైన కార్యక్రమాలు చేపట్టేందుకు క్యాడర్​ను సిద్ధం చేయాలని భావిస్తున్నారు.

రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల కోడ్ వచ్చే నెల 6తో ముగియనుంది. ఆ తర్వాత మరో మూడు నెలల పాటు వరుసగా లోకల్ బాడీ ఎన్నికల వాతావరణం కనిపించనుంది.