మూలకు పడిన ఫారెస్ట్ జీప్ పేరిట నెలకు రూ.30 వేలు హాంఫట్​

మూలకు పడిన ఫారెస్ట్ జీప్ పేరిట నెలకు రూ.30 వేలు హాంఫట్​
  •     నెలకు 160 లీటర్ల డీజిల్,  డ్రైవర్ మెయింటనెన్స్​ అంటూ అలవెన్స్​డ్రా 
  •     కాగజ్​నగర్​డివిజన్​లో ఫారెస్ట్​ ఆఫీసర్ల మాయ
  •     ‘పులి వేట’ సాకుతో ప్రభుత్వ సొమ్ము జేబులోకి...

కాగజ్ నగర్ వెలుగు: ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్ నగర్ డివిజన్​లో ఫారెస్ట్ ఆఫీసర్లు మూలకు పడిన జీప్ కు ఇప్పటికీ అలవెన్స్ డ్రా చేస్తున్నారు. డివిజన్​లో ఐదు రేంజ్​లు ఉండగా..రేంజ్ కి ఒకటి చొప్పున రేంజర్లకు జీప్​లను అటవీ శాఖ కేటాయించింది. వీటితో పాటు డివిజన్​లో ర్యాపిడ్ రెస్క్యూ టీమ్, స్ట్రైక్ ఫోర్స్ కోసం ఇంకో జీప్ కేటాయించింది. ఇందులో కాగజ్ నగర్ రేంజ్ లో ఆర్అర్ టీ (ర్యాపిడ్ రెస్క్యూ టీమ్) వాహనం (ఏపీ 01 ఎస్ 8281) 6 నెలలుగా మూలకు పడి నడవట్లేదు. దీన్ని వంజిరి దగ్గరున్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర పెట్టారు.

అయితే, మూడు నెలలుగా ఈ జీప్ నడుస్తున్నట్లు రేంజ్ అధికారులు బిల్లులు పెడుతూ అలవెన్సులు డ్రా చేస్తున్నారు. ప్రొవిజన్ ప్రకారం నెలకు160 లీటర్ల డీజిల్, డ్రైవర్ జీతం రూ.9500 , మెయింటెనెన్స్ రూ.1600 డ్రా చేస్తున్నారు. గత జనవరిలో కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్​లో రెండు పులులు చనిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అదనపు సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదే అదునుగా రేంజ్ అధికారులు మూలకు పడ్డ జీప్​కు కూడా నెలకు రూ.30 వేల చొప్పున.. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు రూ.90 వేలు డ్రా చేశారు. పులుల మృతి తర్వాత కాగజ్​నగర్​ డివిజన్​కు జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ నీరజ్ కుమార్ టిబ్రేవాల్ ఇన్ చార్జీగా ఉన్న టైంలో ఈ తతంగం జరిగింది. దీనిపై కాగజ్ నగర్ ఇన్​చార్జి ఎఫ్ డీవో అప్పల కొండను వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించలేదు. డివిజన్ ఆఫీస్ సూపరింటెండెంట్ ​కీర్తిపాల్ ను అడగ్గా తనకి తెలియదని, బిల్లుల సంగతి డీఎం చూస్తారని, అందుబాటులో లేరని చెప్పారు.