రెచ్చిపోతున్న రియల్ మాఫియా

రెచ్చిపోతున్న  రియల్ మాఫియా
  • ఆదిలాబాద్ లో డబుల్ రిజిస్ట్రేషన్లతో టోకరా
  • లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు
  • పోలీస్ కేసులతో వెలుగులోకి రియల్టర్ల మోసాలు 
  • ఆయా శాఖల్లో అధికారుల అండతో అక్రమాలు 

ఆదిలాబాద్, వెలుగు: జిల్లాలో రియల్ మాఫియా రెచ్చిపోతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు అనే తేడా లేకుండా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి భూకబ్జాలకు పాల్పడుతున్నారు. ఒక్కో ప్లాట్ ను డబుల్ రిజిస్ట్రేషన్ చేసి కోట్లు దండుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ఈ దోపిడీ ఇటీవల పోలీసుల కేసులతో వెలుగులోకి వస్తున్నాయి. గతంలో భూములు కొనుగోలు చేసిన బాధితులు తమకు అమ్మిన భూమికి డబుల్ రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలుసుకొని పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఇలాంటి సంఘటనలపై సీరియస్ గా ఉండడంతో చాలా మంది బాధితులు తమకు జరిగిన అన్యాయం గురించి బయటకు వస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారులకు మున్సిపాలిటీ, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలకు చెందిన కొంతమంది అధికారులు, ఉద్యోగులు సహకరిస్తున్నారు. దీంతో వారిపై సైతం కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లాలో పేరు మోసిన రియల్టర్లతో పాటు ఓ పొలిటికల్ లీడర్ సైతం అమాయకులను బెదిరిస్తూ తప్పుడు పత్రాలతో భూములను కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.  

లబోదిబోమంటున్న బాధితులు..

ఇటీవల మావలలోని 175 సర్వే నంబర్​లో డబుల్ రిజిస్ట్రేషన్ బాగోతం బయటపడడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఇలా ఆదిలాబాద్ పట్టణంలోని మావల, ధస్నాపూర్, రణదివేనగర్, బట్టిసవర్గాం, ఖానాపూర్ లో పెద్ద ఎత్తున లేఔట్లు చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్లలో కొన్నింటికి డబుల్ రిజిస్ట్రేషన్లు, కొందరికి ఒక ప్లాట్ చూపించి మరో ప్లాట్ ను రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో కొందరు బాధితులు మాత్రమే పోలీసులను ఆశ్రయించగా మిగతా వారు కూడా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ హామీ ఇస్తున్నారు.

రియల్ వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా అమాయకులకు డబుల్ రిజిస్ట్రేషన్లు, నకిలీ పత్రాలతో భూములు కబ్జా చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. భూముల కబ్జాలకు సహకరించి నకిలీ పత్రాలు సృష్టించి డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్న కేసుల్లో కొందరు అధికారులు, ఉద్యోగులు పోలీసులకు చిక్కుతున్నారు. ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రర్ ఆఫీసులో నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు జరుగుతున్న పర్యవేక్షణ లేకపోవడంతో కోట్ల ఆస్తులు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి.

ఇటీవల బయటపడ్డ కేసులు..

ఈనెల 5న ఒకే ప్లాట్ ను డబుల్ రిజిస్ట్రేషన్ చేసి మోసం చేసిన కేసులో నిందితురాలిని మావల పోలీసులు అరెస్టు చేశారు. రియల్ ఎస్టేట్ పేరుతో అమాయకులకు ఓకే ప్లాటును పలుమార్లు అమ్మి మోసానికి పాల్పడుతున్న చింతల పల్లి ఆశలతను పోలీసులు అరెస్టు చేశారు. 2013లో మావల గ్రామంలోని సర్వే నంబర్ 175 లోని ప్లాట్ నంబర్ 23ను నిందితురాలు రూ. 1,10,000కు రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ ద్వారా అమ్మింది. అదే ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అప్పటికే 1996లో మహేశ్ అనే వ్యక్తికి విక్రయించినట్లు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రికార్డుల ద్వారా వెల్లడైంది. ఇలా పలుమార్లు ఆ ప్లాట్ ను అమ్ముతూ అక్రమంగా డబ్బులు సంపాదించినట్లు విచారణలో తేలింది. 

గత అక్టోబర్​లో జిల్లా కేంద్రంలోని 29/సీ  సర్వే నంబర్లలోని ఏడు ప్లాట్లను డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకొని మోసానికి పాల్పడిన కేసులో ఆర్​డబ్ల్యూఎస్​డీ ఈఈ  వెంకటరమణ, రిమ్స్ ఆయూష్ విభాగం ఎంప్లాయ్ సంజీవ్ కుమార్, మాజీ కౌన్సిలర్ రఘుపతిని అరెస్టు చేశారు. ఈ కేసులో రూ. 7 లక్షలు లంచం తీసుకొని డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రర్ అశోక్ పై కేసు నమోదైంది. రూ. 2 కోట్ల విలువైన ఈ ప్లాట్లకు సదరు అధికారి రూ. 7 లక్షలు లంచం తీసుకున్నారు.  

గతేడాది జిల్లా కేంద్రంలో ఈడీ, ఎస్బీఐ బ్యాంకు ఆధీనంలో ఉన్న కోట్ల విలువ చేసే భూమిని అక్రమంగా కబ్జా చేసిన కేసులో బడా రియల్టర్లను అరెస్టు చేశారు. నకిలీ పత్రాలతో కబ్జా చేసినట్లు తేలడంతో రమేశ్ శర్మ, ఇబ్రహీంపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం 

డబుల్ రిజిస్ట్రేషన్లతో, నకిలీ పత్రాలతో మోసపోయిన బాధితులు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. భూముల కొనుగోలు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇటీవల డబుల్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి మావలలో కేసు నమోదు చేశాం. ఇంకా బాధితులు ఉంటే ముందుకు రావాలి. - అఖిల్ మహాజన్, ఆదిలాబాద్ ఎస్పీ