
- అభ్యర్థి రాకేశ్ రెడ్డిపై కొందరు మాజీల విముఖత
- ‘పల్లా’ వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇచ్చారంటూ గుస్సా
- ఎలక్షన్‌కు సహకరించకుండా ఎడమొహం..పెడమొహం
- కేటీఆర్ రివ్యూ మీటింగ్ కు పలువురు నేతల డుమ్మా
- గందరగోళంలో పార్టీ అధిష్టానం
హనుమకొండ, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడిన బీఆర్ఎస్కు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కొత్త పంచాయితీ తెచ్చి పెట్టింది. పార్టీకి చెందిన పలువురు లీడర్లు గ్రాడ్యుయేట్స్ టికెట్ ఆశించగా..పల్లా రాజేశ్వర్‌రెడ్డి వర్గానికి చెందిన ఏనుగుల రాకేశ్‌రెడ్డికి కేటాయించడంపై కొంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాకేశ్‌రెడ్డికి టికెట్అనౌన్స్ చేసినప్పటి నుంచే ఎడమొహం, పెడమొహంగా ఉంటుండగా..బుధవారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్నిర్వహించిన గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ రివ్యూ మీటింగ్ లో విభేదాలు బయటపడ్డాయి.
ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు చెందిన 130 మంది లీడర్లకు సమాచారమిస్తే 50 నుంచి 60 మంది మాత్రమే హాజరవడం, ఇందులో ఉమ్మడి వరంగల్ కు చెందిన పలువురు ముఖ్య నేతలు డుమ్మా కొట్టడం వారి అసంతృప్తిని బయటపెట్టింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. గ్రాడ్యుయేట్స్ సిట్టింగ్ స్థానాన్ని నిలిబెట్టుకునేందుకు తంటాలు పడుతుండగా.. టికెట్అనౌన్స్ చేసిన తర్వాత జరుగుతున్న పంచాయితీలతో ఆ పార్టీ గందరగోళంలో పడింది.
‘పల్లా’ వర్గానికి ఇచ్చారని గుస్సా
బీఆర్ఎస్పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీజేపీలోనే కొనసాగారు. వరంగల్ వెస్ట్ అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. ఆ పార్టీలో కొనసాగినన్ని రోజులు బీఆర్ఎస్తో పాటు అప్పటి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు వ్యతిరేకంగా పని చేశారు. చివరకు బీజేపీ ఆయనకు టికెట్ఇవ్వకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో యూత్ లో ఫాలోయింగ్, స్థానిక సమస్యలపై పట్టు, వాక్చాతుర్యం ఉన్న రాకేశ్‌రెడ్డిని పల్లా రాజేశ్వర్‌రెడ్డి బీఆర్ఎస్ గూటికి తీసుకువచ్చారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారు. దీన్ని ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ జీర్ణించుకోలేకపోయారు. తనకు వ్యతిరేకంగా పని చేశారంటూ ఇంతవరకు రాకేశ్‌రెడ్డితో ఎక్కడా స్టేజీ కూడా పంచుకోలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాకేశ్‌రెడ్డిని వరంగల్ వెస్ట్‌లో ప్రచార కార్యక్రమాలకు కూడా నిరాకరించడంతో ఆయన చుట్టుపక్కల నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. దాస్యంతో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా రాకేశ్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవడాన్ని వ్యతిరేకించారు.
తమ వారికి టికెట్ ఇవ్వలేదని..
పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కాగా..టికెట్ కోసం చాలామందే పోటీ పడ్డారు. ప్రధానంగా దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, గీత కార్మికుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాల్‌రాజ్, మాస్టర్ జీ విద్యాసంస్థల అధినేత, కుడా మాజీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్‌తో పాటు మరికొందరు ఆశించారు.
వినయ్‌భాస్కర్, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరూ ఎమ్మెల్సీ టికెట్ వాసుదేవారెడ్డికి లేదా సుందర్రాజ్ యాదవ్‌కు ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి తన అనుచరుడైన రాకేశ్‌రెడ్డికి ఇప్పించుకుని పంతం నెగ్గించుకున్నారు. దీంతో ఓ వైపు పల్లా ఏకపక్ష ధోరణి, మరోవైపు రాకేశ్‌రెడ్డి చేరిక పట్ల అసహనంతో ఉన్న వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి..రాకేశ్‌రెడ్డికి టికెట్ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు అభ్యర్థిని మార్చాల్సిందిగా పలుమార్లు కేటీఆర్‌కు కూడా విన్నవించారు.
మీటింగ్‌కు ముఖ్య నేతల గైర్హాజరు
ఎంపీ ఎలక్షన్స్ పూర్తయిన నేపథ్యంలో బుధ వారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ పరిస్థితులపై చర్చించి, గ్రాడ్యుయేట్స్ఎన్నికకు దిశా నిర్దేశం చేసేందుకు కేటీఆర్ రివ్యూ మీటింగ్ పెట్టారు. దీనికి రావాలంటూ ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలోని 33 నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలకు సమాచారమిచ్చారు. కానీ, 50 నుంచి 60 మంది మాత్రమే హాజరయ్యారు.
ముఖ్యంగా ఎమ్మెల్సీ అభ్యర్థి సొంత జిల్లా ఉమ్మడి వరంగల్‌కు చెందిన ముఖ్య లీడర్లు డుమ్మా కొట్టారు. కేటీఆర్ఒత్తిడి మేరకు దాస్యం వినయ్‌భాస్కర్ మీటింగ్‌కు హాజరుకాగా.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, తక్కళ్లపల్లి రవీందర్ రావుతో పాటు మరికొందరు గైర్హాజరయ్యారు.
మిగతా జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు కూడా రాలేదు. బంధువు చనిపోయాడనే కారణంతో ఎర్రబెల్లి, వైరల్ ఫీవర్‌తో పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరు కాలేకపోయారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఈ కొత్త తలనొప్పి ఏమిటని అధిష్ఠానం వాపోతున్నట్టు తెలిసింది. మరో పది రోజుల్లోనే ఎలక్షన్ జరగనుండగా.. పార్టీలో అంతర్గత విభేదాలు ఏ మేరకు ప్రభావం చూపుతాయో చూడాలి.