
ఆస్ట్రేలియా మహిళలతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా మహిళా బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. శనివారం (సెప్టెంబర్ 20) కంగారూలు బ్యాటింగ్ లో విశ్వరూపం చూపించి టీమిండియా ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 47.5 ఓవర్లలో 412 పరుగులకు ఆలౌట్ అయింది. బెత్ మూన్ (75 బంతుల్లో 23 ఫోర్లు, సిక్సర్ తో 138) భారీ సెంచరీతో టాప్ స్కోరర్ గా నిలిచింది. జార్జియా వోల్ (81), ఎల్లిస్ పెర్రీ (68) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. టీమిండియా బౌలర్లలో అరుంధతి రెడ్డి మూడు.. దీప్తి శర్మ, రేణుక ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టారు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. కెప్టెన్ అలిస్సా హీలీ 18 బంతుల్లోనే 7 ఫోర్లతో 30 పరుగులు చేసి టీ20 తరహాలో చెలరేగింది. హీలే ఔటైనా ఆస్ట్రేలియా విధ్వంసం తగ్గలేదు. జార్జియా వోల్, ఎల్లిస్ పెర్రీ జట్టును నడిపించారు. రెండో వికెట్ కు 107 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి 21 ఓవర్లలోనే ఆసీస్ స్కోర్ ను 150 పరుగులకు చేర్చారు. 61 బంతుల్లోనే 14 ఫోర్లతో 81 పరుగులు చేసి వోల్ ఔటయింది. వోల్ వికెట్ తీసినా టీమిండియాకు రిలాక్స్ అవ్వలేదు. నాలుగో స్థానంలో వచ్చిన మూనీ ఇండియా బౌలర్లపై విరుచుకుపడింది.
బౌండరీలతో అరుణ్ జైట్లీ స్టేడియాన్ని హోరెత్తిస్తూ పెర్రీతో కలిసి మూడో వికెట్ కు 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆసీస్ కు భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లింది. ఈ క్రమంలో పెర్రీ, మూనీ ఇద్దరూ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 68 పరుగులు పెర్రీ ఔటైనా.. గార్డనర్ తో కలిసి మూనీ పరుగుల వరద పారించింది. ఈ క్రమంలో కేవలం 57 బంతుల్లోనే మూనీ తన సెంచరీ మార్క్ అందుకోవడం విశేషం. మహిళా వన్డే చరిత్రలో ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్ గా 75 బంతుల్లోనే మూనీ 23 ఫోర్లు, సిక్సర్ తో 138 పరుగులు చేసి ఔటైనది. మరో ఎండ్ లో గార్డనర్ కూడా వేగంగా ఆడడంతో ఆసీస్ 300 పరుగుల మార్క్ దాటింది.
డెత్ ఓవర్లలో వేగంగా ఆడే క్రమంలో ఆసీస్ చక చక వికెట్లను కోల్పోతూ వచ్చింది. దీప్తి శర్మ వేసిన 45 ఓవర్లో మూడు వికెట్లు పడినప్పటికీ అప్పటికే ఆస్ట్రేలియా 380 పరుగులకు చేరుకుంది. చివరి మూడు వికెట్లను త్వరగా తీసిన ఇండియా ఆసీస్ ను 412 పరుగులకు ఆలౌట్ చేయగలిగింది. ఆస్ట్రేలియా తమ చివరి ఆరు వికెట్లను 44 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో రెండు జట్లు 1-1 తో సమంగా ఉన్నాయి.