
తెలంగాణ తెలివితోటి మేల్కోంటుందా అనే ప్రశ్నకి ఎవరైనా తెలంగాణకి తెలివి లేదా అనే ఎదురు ప్రశ్న వేయవచ్చు. కానీ, ఇది నిజం. నిలువరించగలిగిన అన్యాయం నిలువరించకుండా, చేయవలసిన, చేయగలిగిన పనులు సకాలంలో చేయకుండా తెలంగాణ అనేకవిధాలుగా అన్యాయాలకు గురవుతూ వచ్చింది. అన్యాయాల మీద నిరంతరం పోరాడుతూ వచ్చింది. ఇప్పటికీ ఇది నిత్యకృత్యంగానే ఉంది. ఆలోచించేవాళ్లు, అడిగేవాళ్లు, పోరాడుతున్నవాళ్లు ఉన్నా పట్టింపులేని స్వప్రయోజనపరులైన పాలకుల వల్ల, పాలక పార్టీల వల్ల తెలంగాణకు జరుగుతున్న నష్టం అంతా ఇంతాకాదు. ఇందుకు కృష్ణానది నీళ్ల విషయమే ప్రబల సాక్ష్యం.
1994లోనే జలసాధన సమన్వయ సమితి ఏర్పరచి, వివిధ సంఘాలను సంఘటిత పరిచి తెలంగాణకు కృష్ణానది నీటిలో న్యాయమైన వాటా ఇవ్వకపోతే మలిదశ తెలంగాణ పోరాటం తప్పదని హెచ్చరించాం. ఆనాడైనా.. అలాగే 2002లో రాష్ట్రంలో కృష్ణా నీటి ఆశలతో ఉన్న వివిధ ప్రాంతాల సంఘాలను సంఘటితపరిచి రాష్ట్రానికి పంచిన నీటి సమన్యాయ దృష్టితో పున:పంపిణీ చేసి న్యాయం చేయాలని కోరిన నాడైనా..అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ ఉద్యమం నీళ్లను ప్రధాన అంశంగా పాలకవర్గం ముందుపెట్టింది. నీటి పంపిణీ రాష్ట్రాల మధ్య జరుగుతున్నందువల్ల, నీళ్లను పున:పంపిణీ చేయనందువల్ల తెలంగాణకు రాష్ట్ర ప్రతిపత్తి అనివార్యమైంది. రాష్ట్రం ఏర్పడక తప్పలేదు.
జలసాధన ఉద్యమ నేపథ్యం
రాష్ట్రం ఏర్పాటు ఉద్యమానికి సమాంతరంగా సాగిన జలసాధన ఉద్యమ డిమాండ్లను ఆంధ్రా పాలకవర్గం చులకన చేసింది. మీకు కూడా శాసన సభ్యులు, మంత్రులు ఉన్నారు కదా అని అవమానకరంగా మాట్లాడేది. అయినా, తెలంగాణ రాజకీయ ప్రతినిధులు దులిపేసుకునేవారు తప్ప సోయితో స్పందించేవారు కాదు. వీరి స్పందన కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేయవలసి వచ్చేది. కృష్ణానది జలసాధన సమస్యను అధికార పార్టీ సమస్యగా చూసేవారు తప్ప, ఒక రాజకీయ సమస్యగా, ప్రజాసమస్యగా, తమకూ బాధ్యత ఉంటుంది అనే సోయిలోంచి ఆలోచించేవారుకాదు. వివిధ చారిత్రక కారణాల వల్ల కూడా తెలంగాణ సమాజానికి, రాజకీయ నాయకత్వానికి సాగునీటి అనుభవం, అందుకు ఆలోచించిన, పోరాడిన అనుభవం కూడా తక్కువ. దీనిని రైతుల సమస్యగా వదిలేశారు తప్ప పట్టించుకోలేదు.
తెలంగాణ నేతలకు నీళ్లు కాదు, పదవులే ముఖ్యమైనయి
ఫజల్ అలీ కమిషన్ ముందు తెలంగాణ ప్రజలు హైదరాబాదు రాష్ట్రాన్ని ఆంధ్రతో కలిపితే నీళ్లు నష్టపోతాం అని మొత్తుకున్న విషయం తెలంగాణ పాలకవర్గానికి అర్థం కాలేదనే చెప్పాలి. అయివుంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పరుస్తున్నప్పుడు అప్పర్ కృష్ణ, భీమ, తుంగభద్ర ప్రాజెక్టు కాలువ పొడిగింపు వీటిలో గ్రావిటీ ద్వారా 174 టీఎంసీ నీరు ఇవ్వాలని, 1953లో నిర్మాణం తలపెట్టినవిధంగానే నందికొండ ప్రాజెక్టు నిర్మించాలని షరతు విధించి ఉండేవారు. డిమాండ్ల నిర్దిష్టత లేకపోవడం వల్ల పెద్దమనుషుల ఒప్పందం తుడిచిపెట్టుకుపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్టంలో తెలంగాణ ప్రతినిధులు సొంత సుఖాలు, పదవులు చూసుకునే మూడో శ్రేణి నాయకులైపోయారు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన నీటి ప్రాజెక్టులేవీ తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడలేకపోయాయి.
అటువైపు బాగు, ఇటు వైపు పాడు
ఏపీ ప్రభుత్వం సుంకేశులను ఆధునిక ప్రాజెక్టులాగ నిర్మించింది. ఆర్డీఎస్ను నాశనానికి వదిలేసింది. కేసీ కాలువ బాగైంది. ఆర్టీఎస్ కాలువ పాడుబడింది. శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు పేరిట తెలుగు గంగ కాలువ కృష్ణానదిని మలిపే భారీ కాలువగా రూపుదిద్దుకుంది. కుడి కాలువ అంతటి ప్రయోజనకారి కాగా, తెలంగాణ వైపు ఎడమ కాలువలోకి నీరు తీసుకురాగల టన్నెల్ పనులు వదిలేశారు. గ్రావిటీ నీటిని కూడా ఎత్తిపోసుకునే దుస్థితి మిగిల్చారు. నల్గొండ జిల్లా ఫోరైడ్ పీడిత గ్రామాల సాగు, తాగునీటి కోసం చేపట్టిన ఎంఎంఆర్ ఎత్తిపోతల పథకపు నీళ్లు శ్రీశైలం ఎడమకాలువకు మలిపి చేతులు దులుపుకున్నారు. మహబూబ్నగర్ జిల్లాకు లక్ష ఎకరాల పారుదల కోసం చేపట్టిన జూరాల ప్రాజెక్టు నిర్మాణానికి పదిహేనేండ్ల సుదీర్ఘకాలం తీసుకున్నారు. జలయజ్ఞంలో కృష్ణానదిమీద అటు ఆంధ్రవైపు, ఇటు తెలంగాణ వైపు చేపట్టిన ఎత్తిపోతల పథకాల నిర్మాణంలో చూపిన వివక్షరాస్తే ఒక్కొక్క పథకానిది ఒక గ్రంథమే అవుతుంది. ఈ వైఫల్యానికి వివిధ పార్టీల తెలంగాణ నాయకులందరూ బాధ్యులే.
తెలంగాణ పాలకవర్గాలను నిలువరిస్తున్న ఆంధ్రా పెట్టుబడిదారులు
మొదటి నుంచి కృష్ణానది నుంచి నీళ్లివ్వటమే తప్ప తీసుకుని అనుభవించింది లేనేలేదు. విద్యుత్తులేనినాడు, శాస్త్ర సాంకేతిక విద్వత్తులేనినాడు తెలంగాణ మిట్టప్రాంతం కనుక తెలంగాణ ప్రజలది కూలి బతుకులే అంటే బాగుండేదేమోకానీ, ఇంత ముందడుగు వేసిన తరువాత కూడా ఇంతటి దుస్థితి మిగలటం కేవలం పాలనా దౌర్భాగ్యమే. అందువల్లనే వందశాతం పరీవాహక ప్రాంతంలో ఉండి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలు మునుగోడు ప్రాంతం ఎడారిగా మిగిలాయి. భూములను మట్టిగా తప్ప తరలించుకుపోలేరు కనుక తేరగా తెలంగాణ భూములమీదికి రాగలిగిన ఆంధ్ర సంపన్నవర్గాలు నదుల నీటిని సునాయసంగా తరలించుకుపోతున్నాయి. ఈ కాలంలో ఒక మేరకు నీటి అనుభవం సాధించుకున్నా తెలంగాణ పాలకవర్గం కృష్ణానదిలో తెలంగాణ నీటివాటా పట్ల నిర్లిప్తంగా మిగిలిపోయింది. ఇంకోవైపున రియల్ ఎస్టేట్ మాఫియా, ఇతర పెట్టుబడులు పోగేసుకున్న భిన్న రంగాల మాఫియాలు తమ శక్తికొద్దీ జలవనరుల కల్పన, జరుగకుండా పాలకవర్గాన్ని నిలువరిస్తున్నాయి. అందువల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చినా తెలంగాణకు కృష్ణానీటిలో న్యాయమైన వాటా రాలేదు.
సీఎం రేవంత్రెడ్డి చెప్పింది కఠోర నిజం!
దేశంలో బ్రిటిష్ పాలన ముగిసిన 78 ఏండ్ల తర్వాత తెలంగాణ ఏర్పడిన 12 ఏండ్లకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహబూబ్నగర్ జిల్లా మాసాపేట బహిరంగసభలో మాట్లాడుతూ ఒక కఠినమైన నిజం చెప్పగలిగాడు. ఇంతకాలంగా మేం చెపుతూ వచ్చిన నిజం అదే. అదేంటంటే, మహబూబ్నగర్ జిల్లా గత పాలకుల విధాన వైఫల్యాల వల్ల విద్యకు, ఇరిగేషన్కు నోచుకోకపొవటం వల్ల కరువు, వలసల జిల్లాగా మిగిలిందని ఈ జిల్లాను ‘షో కేసు బొమ్మలాగ విదేశీయులకు ఇక్కడి కరువును, ఆకలి చావులను చూపి నిధులు తెచ్చుకున్నారని. ఇవే మాటలు తెలంగాణ వచ్చిన తర్వాత గత పాలకులకు కూడా వర్తిస్తాయి. వాళ్లు మరొక అడుగు ముందుకు వేసి ఇక్కడి వలసలు ఆగినాయని, బతుకులు బంగారు బతుకులయినాయని అబద్ధాలు మాట్లాడారు. ఇలాంటి దీర్ఘకాల అనుభవాలు కృష్ణా తీరంలోని తెలంగాణ పాలకవర్గం రాజకీయంగా ఎంత బాధ్యతా రాహిత్యంగా ఉందో పట్టిచూపుతాయి. జూరాలను ప్రధాన సాధనంగా గుర్తించలేదుతెలంగాణ ఇంజినీర్లు ఎంత ఉద్యోగులైనా న్యాయం ఆలోచించలేకపోయారు. కృష్ణా పరీవాహక ప్రాంత బీడు భూములకు సాగునీటి సమగ్ర ప్రణాళికలు రూపొందించలేకపోయారు. ప్రజల డిమాండ్లలో రూపుదిద్దుకున్న పాలమూరు–రంగారెడ్డి పథకాన్ని తప్పుడుగా రీడిజైన్ చేస్తుంటే ప్రజల ముందుకు రాలేకపోయారు. అవతల ఆంధ్రావాళ్లు బేసిన్ దాటించి నీరు తరలించుకుపోయే నిర్మాణాలు చేపడుతుంటే ఇక్కడి పాలక, ప్రతిపక్షపార్టీలు మొత్తుకోవడం తప్పితే, ప్రజలు సాధించి ఇచ్చిన తెలంగాణను సమర్థంగా పాలించడానికి, పునర్నిర్మించడానికి విధాన రచన చేయలేకపోయారు. జూరాల ప్రాజెక్టును కృష్ణానది నీటివాటా ఉపయోగించుకునే ప్రధాన సాధనంగా గుర్తించలేకపోయారు. కృష్ణకు కుడివైపు ఆర్డీఎస్ కుడి కాలువ, కేసీ కాలువ, హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు, గాలేరు–నగరి, వెలిగొండ, ముచ్చుమారి, సాగర్ కుడి
కాలువ, ప్రకాశం బ్యారేజీ కాలువలు, పట్టిసీమ ఇలా అనేక వ్యవస్థలు నిర్మించుకుని నీరు తీసుకుపోతుంటే చేష్టలుడిగి కాలం గడిపారు తప్పితే, ఏమీ చేయలేకపోయారు.
తెలంగాణలో రైతులకు భూమికి నీరివ్వాలంటే ఎత్తిపోతల పథకాలు చేపట్టకతప్పదు. రైతు భరోసా, బంధు వంటి పథకాలు సాగునీటి కష్టాలను తీర్చవు. కాలువ కింది రైతులకు భిన్నంగా ఎగువ ప్రాంత రైతులకు ఎక్కువ కష్టాలు, ఖర్చులు ఉంటాయి కానీ, పంటకు రేటేమీ ఎక్కువరాదు. బీఆర్ఎస్ పాలన తీరని అనర్థం చేసిందిఅందువల్ల ప్రతి ఎకరాకు ఒక పంటకైనా కాలువనీరు అందించే ప్రణాళికలను ప్రభుత్వం రూపొందించాలి. శ్రద్ధతో, నిర్దిష్ట కాల పరిమితితో అమలుచేయాలి.
తెలంగాణను సేద్యం కాపాడినంతగా మరేదీ కాపాడదు. తెలంగాణ మధ్య తరగతి, పాలకవర్గం ఈ నిజం గుర్తించాలి. తమ అలోచనలను రైతులవైపు నించి సరిదిద్దుకోవాలి. టీఆర్ఎస్ / బీఆర్ఎస్ పార్టీ తన పాలనా కాలంలో సమగ్ర నీటి పాలసీ చేయలేకపోయింది. కృష్ణానది నీటిలో తెలంగాణకు జరిగిన నష్టం దేశానికి వివరించలేకపోయింది. ఇప్పటికీ కనీస పశ్చాత్తాపం లేకుండా మాట్లాడుతున్నది. ఈ డెబ్బై ఎనిమిది ఏండ్లు మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని, నల్లగొండ జిల్లాలోని మునుగోడు తదితర ప్రాంతాల భూములకు నీరు అందివుంటే ఇక్క డి ప్రజల బతుకులు అడ్డా బతుకులుగా మిగిలేవా.. ఆలోచించలేకపోతే ఈ నాయకులకు రాజకీయాలు చేసే అర్హత ఉంటుందా?
ట్రిబ్యునల్ ముందు గట్టిగా పోరాడాలి
ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 16.9.2025న 34 జీఓ విడుదల చేసినట్టుగా 16 ప్రాజెక్టులను ప్రతిపాదిస్తు న్నట్టుగా వింటున్నాం. ట్రిబ్యునల్ కట్టిన ప్రాజెక్టులను పరిశీలనకు తీసుకుంటున్నట్టుగా, కట్టని ప్రతిపాదనలను ఎలా చూస్తుందో తెలియదు. ఇంతలో, అవతలి ముఖ్యమంత్రి 200 టీఎంసీల గోదావరి నీటి తరలింపు ఆలోచనకు తెగబడ్డాడు. తెలంగాణలో కృష్ణానదీ జలాల పున: పంపిణీ ఉద్యమం.. నీటి పంపిణీకి, పున:పంపిణీ హేతుబద్ధమైన ప్రతిపాదనలు రూపొందించింది. పరీవాహక ప్రాంత ప్రాతిపదికను ఏనాడో ఏపీ అతిక్రమించింది. ఆ లెక్కన ఏపీకి నీరు రాదు. ఇవ్వడానికి అవకాశాల్లేవు. ట్రిబ్యునల్ కూడా పరీవాహక ప్రాంత న్యాయం, అంతర్జాతీయ జల సూత్రాల ప్రామాణికతలను దాటింది. ఈ పరిస్థితులలో పరీవాహక ప్రాంతం అనేదానికి భూమి, జనాభా, వర్షపాతం, భూగర్భజల లభ్యత, భూమి తేమ నిలుపుకునే శాతం, వెనుకబాటుతనం, ఇంతకాలం ఉపయోగించుకోనందువల్ల జరిగిన నష్టం వంటి విషయాలను చాలా లోతుగా చర్చలో ఉంచాలి. అన్ని రాజకీయ పార్టీలు, యావత్తు తెలంగాణ సమాజం పొరుగు ఆంధ్రలాగ తెలంగాణకు న్యాయమైన నీటి వాటా సాధనలో ఒక గొంతుగా గట్టిగా మాట్లాడాలి. పోట్లాడాలి. అసమానతను, అన్యాయాన్ని ప్రజలు ఎల్లకాలం సహించరు. అందుకే అడగటం. యావత్తు తెలంగాణ ఇప్పటికైనా కృష్ణానది జలసాధనలో తెలివితో మేల్కొంటుందా.
పబ్బం గడుపుకున్న బీఆర్ఎస్
ఆంధ్రప్రదేశ్ ఎడాపెడా ప్రాజెక్టులు కడుతున్నది కనుక నీళ్లు పంచాలని కర్నాటక, మహారాష్ట్ర కోరిన మీదట జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్ ఏర్పరచారు. ఆ ట్రిబ్యునల్ వినియోగించుకుంటున్నవారి హక్కులు కాపాడే పేరున ఏపీకి 811 టీఎంసీల నీరు పంచింది. తెలంగాణలో భారీ నిర్మా ణాలు లేవు గనుక తెలంగాణ నష్టపోయింది. ట్రిబ్యునల్ తీర్పు తరువాత నష్టపోయిన తెలంగాణలో కాకుండా ఆంధ్రాలోనే ఉమ్మడి ప్రభుత్వం అనేక నిర్మాణాలు చేపట్టింది. బచావత్ తీర్పు గడువు ముగిసి గడిచిన ఇరవై ఆరు ఏండ్లుగా బ్రిజేశ్ ట్రిబ్యునల్ పని చేస్తున్నది. 2013లోనే తొలి నివేదిక ఇచ్చి యథాతథ స్థితి కొనసాగించేలా చూశారు. అందుకు విభజన చట్టంలో కూడా నీరు పంచకుండా ఆంక్షలు రాయించారు. తెలంగాణ పాలకవర్గం విభజన చట్టం చదవలేదు. చట్ట రచనను ప్రభావితం చేయలేదు. టీఆర్ఎస్/ బీఆర్ఎస్ ప్రభుత్వం తన పబ్బం గడుపుకున్నది కానీ నీటివాటా కోసం నిలదీయలేదు. రాష్ట్రం సాధించుకున్న వేడిలో కృష్ణానదిపై చేపట్టవలసిన ప్రాజెక్టులు చేపట్టలేదు. జూరాల ఆధారంగా తెలంగాణ నీటి హక్కులు కాపాడుకోవాలంటే వినిపించుకోలేదు. అడిగినవారిమీద అక్రమ కేసులు బనాయించింది. నోటి ఆగడంతో బుకాయించింది. అందువల్ల 2005 నాటికి చేపట్టిన చిన్నచిన్న పథకాలు కూడా ఈ నాటికి పూర్తికాలేదు. ఇంతలో విభజన చట్టం ఆసరాతో కేంద్రం కృష్ణా, గోదావరి నదులను తన చేతిలోకి తీసుకుంది.
ఎం. రాఘవాచారి,
కన్వీనర్, పాలమూరు అధ్యయన వేదిక