విషం చిమ్ముతున్న బూడిద.. రోగాల బారిన పడుతున్న జనం..

విషం చిమ్ముతున్న బూడిద.. రోగాల బారిన పడుతున్న జనం..
  • జవహర్​నగర్, దుండిగల్​ డంపింగ్ ​యార్డుల వద్ద డేంజర్​
  • వేస్ట్​ టు ఎనర్జీ ప్రాసెస్​లో రూల్స్​బ్రేక్​బూడిదతో వ్యాధులు  
  • డబ్ల్యూహెచ్​ఓ చెప్పిన దానికంటే వెయ్యిరెట్లు ఎక్కువ కాడ్మియం సెంట్రల్ పీసీబీ రిపోర్ట్​

హైదరాబాద్​సిటీ, వెలుగు : జవహర్ నగర్, దుండిగల్​డంపింగ్​యార్డ్​పరిసర ప్రజల ప్రాణాలు అపాయం అంచున నిల్చున్నాయి. రాంకీ సంస్థ డంపింగ్​యార్డుల దగ్గర చెత్తను ప్రాసెస్​చేయడానికి ఏర్పాటు చేసిన మూడు ప్లాంట్ల నుంచి వెలువడుతున్న బూడిద చుట్టుపక్కల జనాల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నది.

 ఇక్కడ తగలబెడుతున్న చెత్త నుంచి వెలువడుతున్న బూడిదలో హెవీ మెటల్ పొల్యూషన్​కారకాలు అధిక మోతాదులో ఉన్నాయని సెంట్రల్​పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు నివేదికలో వెల్లడైంది. నిర్వాహకులు రూల్స్​ బ్రేక్​ చేస్తుండడం వల్లే ఇలా జరుగుతోందని సీపీసీబీ తన నివేదికలో వెల్లడించింది. డంపింగ్​యార్డులో నేషనల్ ​గ్రీన్​ ట్రిబ్యునల్ ​రూల్స్​బహిరంగంగానే ఉల్లంఘిస్తున్నారని పర్యావరణవేత్తలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

బూడిదలో ప్రమాదకర కారకాలు  

సెంట్రల్​పొల్యూషన్​కంట్రోల్​బోర్డు నివేదిక ప్రకారం జవహర్‌నగర్ లోని ప్లాంట్లలో చెత్తను తగలబెట్టడం వల్ల వెలువడుతున్న బూడిదలో కాడ్మియం స్థాయి 858.65 ఎంజీ/కిలో ఉందని, ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) అనుమతించిన 0.8 ఎంజీ/కిలో పరిమితి కంటే 1,073 రెట్లు ఎక్కువని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే, క్రోమియం స్థాయి 230.31 ఎంజీ/కిలో వద్ద ఉందని, ఇది కూడా డబ్ల్యూహెచ్​పరిమితులను దాటిపోయిందన్నారు.

 దుండిగల్​ప్లాంట్​వద్ద కాడ్మియం స్థాయి 956.69  ఎంజీ/కేజీ వద్ద ఉందని, ఇది డబ్ల్యూహెచ్ఓ పరిమితి కంటే 1,195 రెట్లు ఎక్కువని ప్రకటించింది. కాలిపోగా మిగిలిన బూడిదను ఇటుకల తయారీకి ఉపయోగించాలని లేదా జనావాసాలు లేని చోట ఉండే భూముల చదునుకు వాడాలని, కానీ..జవహర్‌నగర్ డంప్‌సైట్‌లోనే పారబోస్తున్నారని వెల్లడించింది. దీనివల్ల అక్కడున్న భూమి, నీరు, అండర్​గ్రౌండ్​వాటర్​కలుషితమై పర్యావరణంపై ప్రభావం చూపుతున్నదని చెప్పింది. దీంతో చుట్టుపక్కల నివసిస్తున్న జనాల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నదని తెలిపింది.  

సివిల్​సొసైటీ రిపోర్టులోనూ..

సివిల్ సొసైటీకి చెందిన ఫ్యాక్ట్​ఫైడింగ్​టీమ్​2025 మేలో విడుదల చేసిన రిపోర్టులోనూ ఈ డంపింగ్​యార్డుల వద్ద వ్యర్థాలు, గాలి, నీరు, భూమిని కలుషితం చేస్తూ స్థానికుల ఆరోగ్యం, జీవనోపాధిపై  ప్రభావం చూపుతున్నాయని తెలిపింది. వేస్ట్ నిర్వాహకులు రూల్స్​పాటించేంతవరకు వేస్ట్​ టూ ఎనర్జీ ఆపరేషన్లను నిలిపివేసేలా చూడాలని తెలంగాణ పీసీబీకి విజ్ఞప్తి చేస్తున్నారు. 

వెలువడుతున్న బూడిద,  ప్రజలపై చూపుతున్న ప్రభావాలకు సంబంధించి స్వతంత్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2025 ఏప్రిల్‌లో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు రీసస్టైనబిలిటీ లిమిటెడ్ (రామ్‌కీ) ద్వారా నిర్వహిస్తున్న డంపింగ్​యార్డు విజిట్​చేయగా, ప్లాంట్ అధికారులు “జీరో వేస్ట్” ప్లాంట్ అని, బూడిత అంతా సిమెంట్ పరిశ్రమలు , ఇటుకల తయారీదారులకు పంపిస్తున్నామని చెప్పారు. కానీ, అలా జరగడం లేదని సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీకి చెందిన చైతన్య దేవిక కులసేకరన్ చెప్తున్నారు. 

రోగాల బారిన స్థానికులు

ఫ్యాక్ట్​ ఫైడింగ్​ టీమ్​ పరిశీలలో చాలా విషయాలు వెల్లడయ్యాయి. యార్డు శివారు ప్రాంతాల ప్రజలు శ్వాసకోశ సమస్యలు, కిడ్ని ఫెయిల్ కావడం​,  తీవ్రమైన చర్మ వ్యాధుల భారిన పడుతున్నారని వారి నివేదికలో వెల్లడైంది. చాలా మంది గొంతు, నోటి ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారని తేలింది. ఎక్కువ టెంపరేచర్​ వద్ద వ్యర్థాలను కాల్చడం వల్ల విడుదలయ్యే పొగ, బూడిదలో విషపూరిత కాలుష్య కారకాలు ఉండడంతో వ్యాధులు వస్తున్నాయని తేల్చారు.

 చెత్త కాలిస్తే వచ్చే కాలుష్య కారకాలు ఇంటి బయట బట్టలు ఆరేస్తే వాటిపై పడుతున్నాయని, అవి వేసుకోవడం వల్ల దద్దుర్లు, స్కిన్​అలెర్జీ సమస్యలు వస్తున్నాయంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా మంది ట్రీట్​మెంట్​పొందలేకపోతున్నారని చెప్పింది. 

పబ్లిక్​గా రూల్స్​బ్రేక్​చేస్తున్నరు

వేస్ట్​టు ఎనర్జీ ప్రక్రియలో డ్రై వేస్ట్​మాత్రమే విద్యుత్​ఉత్పత్తికి వినియోగించాలి. కానీ, రాంకీ సంస్థ బల్దియా ఇచ్చే డబ్బుల కోసం తడి, పొడి చెత్తను కలిపి తగలబెడుతోంది.మిక్సుడ్​ వేస్ట్​కాలబెట్టడం వల్ల ప్లాస్టిక్​నుంచి వెలువడే విషపూరిత వాయువులు చుట్టుపక్కల నివసిస్తున్న వారి జీవితాన్ని అంధకారంలోకి నెట్టుతున్నది.

 కాలబెట్టిన తర్వాత బూడిదను ప్రాపర్​గా డిస్పోజ్​చేయడం లేదు. అక్కడే పారబోస్తుండడంతో అది గాలిలోకి లేచి వ్యాధులకు కారణమవుతున్నది. రాంకీ సంస్థ పబ్లిక్​గా రూల్స్​బ్రేక్​చేస్తున్నది. డాటాను కూడా పబ్లిక్​గా పెట్టాలన్న రూల్​ను కూడా పాటించడం లేదు.  – రుచిత్ ఆశా కమల్, క్లైమేట్​ ఫ్రంట్​ ఆర్గనైజేషన్​