ఏపీలో మారిన పనివేళలు.. ఇకపై పది గంటలు పని చేయాల్సిందే.. !

ఏపీలో మారిన పనివేళలు.. ఇకపై పది గంటలు పని చేయాల్సిందే.. !

శనివారం ( సెప్టెంబర్ 20 ) ఏపీ అసెంబ్లీ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఏపీలో ఉద్యోగుల పనివేళలు పది గంటలకు పెంచుతూ ప్రవేశపెట్టిన కార్మిక చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది ఏపీ అసెంబ్లీ. ఏపీలోని దుకాణాలు, ఫ్యాక్టరీలు, ఇతర వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పనివేళలు పది గంటలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రబుత్వం. రోజువారీ పనివేళలు పెంచడంతో పాటు మహిళలను షిఫ్టులకు అనుమతిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.

ఏపీ దుకాణాలు, వాణిజ్య సంస్థల సవరణ బిల్లు 2025, ఫ్యాక్టరీస్ సవరణ బిల్లు 2025 లను కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సభలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. కొత్త బిల్లుల ప్రకారం దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థల్లో రోజువారీ పనివేళలు 8 నుంచి 10 గంటలకు పెరిగినట్లయ్యింది. అయితే... వారానికి మొత్తం పనివేళల పరిమితి 48 గంటలను యధాతధంగా ఉంచింది ప్రభుత్వం. దీంతో పాటు ఉద్యోగుల ఓవర్ టైం పరిమితిని కూడా భారీగా పెంచింది ప్రభుత్వం.. గతంలో 75 గంటలుగా ఉన్న ఓవర్ టైం లిమిట్ ఇప్పుడు 144 గంటలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
 
సవరణలో భాగంగా మహిళలు నైట్ షిఫ్టులపై ఉన్న ఆంక్షలు కూడా సడలించింది కూటమి ప్రభుత్వం. ఇకపై మహిళలు తాము కోరుకుంటే రాత్రి పూట 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా విధుల్లో కొనసాగొచ్చని తెలిపింది ప్రభుత్వం. నైట్ షిఫ్టులలో పనిచేసే మహిళా ఉద్యోగుల భద్రతతో పాటు ఇంటి నుంచి ఆఫీసుకు వచ్చేందుకు రవాణా సౌకర్యం కల్పించే బాధ్యత యజమాన్యానిదే అని స్పష్టం చేసింది ప్రభుత్వం.

అంతే కాకుండా.. ఫ్యాక్టరీలలో పనిచేసే ఉద్యోగులకు ప్రతి 6 గంటలకు అరగంట పాటు తప్పనిసరిగా బ్రేక్ ఇవ్వాలని, బ్రేక్ టైంతో కలిపి ఉద్యోగుల పనివేళలు రోజుకు 12 గంటలకు మించకూడదని పేర్కొంది ప్రభుత్వం. 20 మంది ఉద్యోగుల కంటే తక్కువ సిబ్బంది ఉన్న చిన్న సంస్థలకు పలు నిబంధనల నుంచి మినహాయింపులు కల్పించినప్పటికీ.. భద్రతకు సంబందించిన నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలని తెలిపింది ప్రభుత్వం.