ప్రపంచం అంతా H-1B గందరగోళం : టికెట్ రేట్లు ట్రిపుల్.. కొందరు మధ్యలో దిగేస్తే.. ఇంకొందరు ఎయిర్ పోర్ట్ నుంచే వెనక్కి

ప్రపంచం అంతా H-1B గందరగోళం : టికెట్ రేట్లు ట్రిపుల్.. కొందరు మధ్యలో దిగేస్తే.. ఇంకొందరు ఎయిర్ పోర్ట్ నుంచే వెనక్కి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు ప్రపంచం అల్లాడిపోతుంది. H 1B వీసాలపై లక్ష డాలర్లు ఫీజుతోపాటు అమెరికాలో ఎంట్రీకి సెప్టెంబర్ 21వ తేదీ అర్థరాత్రి వరకు మాత్రమే గడువు ఉండటంతో.. టెక్ కంపెనీలు మొత్తం షాక్ అయ్యాయి. సెలవులు, బిజినెస్ ఇలా అమెరికా బయట ఉన్న H 1B వీసాదారులు గందరగోళంలో పడ్డారు. సెప్టెంబర్ 21వ తేదీ అర్థరాత్రికి అమెరికా తిరిగి వచ్చేయండి అంటూ మెక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా లాంటి పెద్ద కంపెనీల ఆదేశాలతో.. ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాల్లో ఉన్న H 1B వీసాదారులు ఎయిర్ పోర్టులకు క్యూ కడుతున్నారు. అంతేనా జర్నీలో ఉన్న వాళ్లు.. జర్నీ మధ్యలో ఉన్న వాళ్లు.. ఇండియాకు వెళ్దామని ఎయిర్ పోర్టులో ఉన్న వాళ్లు.. అప్పటికప్పుడు టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్లు.. ఇలా అందరూ గందరగోళం.. భజగోవిందం అన్నట్లు తయారైంది. ట్రంప్ సంతకం పెట్టి హాయిగా వెళ్లి నిద్రపోతున్నాడు.. ప్రపంచం మాత్రం నిద్రలేకుండా గండం గడిచేది ఎలా అన్నట్లు వణికిపోతుంది. 

విమానం టికెట్ రేట్లు ట్రిపుల్ : 

వేలం పాట చాలా సార్లు చూసి ఉంటారు.. ఇది మాత్రం ఎయిర్ పోర్టుల్లో వేలం పాట. H1B వీసాదారులు అందరూ 2025, సెప్టెంబర్ 21వ తేదీ అర్థరాత్రిలోపు అమెరికా వచ్చేయండి అని మెక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థలు ప్రకటించాయి. దీన్ని విమానయాన సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. డిమాండ్ అమాంతం.. అందులోనూ కొన్ని గంటలు మాత్రమే ఉండటంతో టికెట్ రేట్లను అమాంతం పెంచేశాయి కంపెనీలు. ఓ నెటిజన్ ఇలా అన్నాడు.. ఢిల్లీ నుంచి న్యూయార్క్ జాన్ ఎఫ్.కెన్నడి ఎయిర్ పోర్ట్ కు.. వన్ వే ఛార్జీ 37 వేల నుంచి 70 వేలకు పెరిగింది. ఇది జస్ట్ గంటలోనే.. ట్రంప్ ప్రకటన వచ్చిన గంటలోనే ఛార్జీ డబుల్ అయ్యింది అంటూ చెప్పుకొచ్చాడు. ఢిల్లీ, ముంబై నుంచి డైరెక్ట్ ఫ్లయిట్ టికెట్.. అది కూడా వన్ వే కోసం లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి ఫ్లయిట్ కంపెనీలు. 

దీంతో ఇండియా నుంచి నేరుగా అమెరికా వెళ్లే విమానాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ముంబై, ఢిల్లీ నుంచి నేరుగా అమెరికా వెళ్లే విమానాల్లో టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ముందు అమెరికాలోని ఏదో ఒక ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయితే చాలు.. అక్కడి నుంచి వెళ్లిపోవచ్చు అన్న ఉద్దేశంలో చాలా మంది H1B ఉద్యోగులు ఉన్నారు. ఇండియా నుంచి అమెరికా గడ్డపై దిగేందుకు.. అది కూడా డైరెక్ట్ ఫ్లయిట్ కోసం సెర్చ్ చేస్తున్నారు ఉద్యోగులు.

ALSO READ : ట్రంప్ నిర్ణయం భూమరాంగ్ అవుతుందా.. 

వెళ్లాలా వద్దా అనే డైలమాలో.. 3 గంటలు ఆగిన విమానం : 

అమెరికాలోనే శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్ట్ లో గందరగోళం నెలకొందని.. ఇండియా వెళ్లే ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది అంటూ మసూద్ రాణా అనే సోషల్ మీడియా యూజర్ చెప్పుకొచ్చాడు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఎమిరేట్స్ విమానంలో ఇండియా రావాల్సి ఉంది. ట్రంప్ ప్రకటన తర్వాత విమానం ఎక్కాలా వద్దా.. ఇండియా వెళ్లాలా వద్దా అనే గందరగోళంలో ప్రయాణికులు ఉన్నారు. దీంతో విమానం 3 గంటలుగా నిలిచిపోయింది అంటూ రాసుకొచ్చాడు.

ఇండియా వస్తూ దుబాయ్ లో దిగి.. మళ్లీ అమెరికా రిటర్న్ :

అమెరికా నుంచి ఇండియా బయలుదేరిన విమానం మధ్యలో దుబాయ్ లో ఆగింది. ఇండియా కనెక్టింగ్ ఫ్లయిట్ కోసం వేచి ఉన్నారు ప్రయాణికులు. ఇంతలోనే ట్రంప్ ప్రకటన వచ్చింది. రెండు గంటల సమయం తర్వాత దుబాయ్ నుంచి ముంబై ఫ్లయిట్ ఎక్కారు ప్రయాణికులు. ఇంతలో ఏమైందో ఏమో.. 15 మంది ప్రయాణికులు విమానం దిగేశారు. దుబాయ్ నుంచి తిరిగి అమెరికా వెళ్లటానికి ఈ విధంగా చేసినట్లు ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సెప్టెంబర్ 21 డెడ్ లైన్ కావటం.. వాళ్లు H 1B వీసాదారులు అంటూ రాసుకొచ్చాడు. 

సెప్టెంబర్ 21వ తేదీ తర్వాత H1B వీసాదారులు అమెరికాలో ఎంట్రీ అవ్వాలంటే అక్షరాల లక్ష డాలర్లు.. మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 88 లక్షల రూపాయలు కట్టాలి. ఇది కంపెనీలకే భారం అయితే.. ఇక సొంతంగా కట్టుకోవాలంటే చాలా కష్టం.. ఈ క్రమంలోనే అమెరికా వెలుపల ఉన్న.. అంటే కంపెనీ సెలవుల్లో, వ్యక్తిగత పనుల్లో ఇతర దేశాల్లో ఉన్న H1B వీసా ఉద్యోగులు అందర్నీ వెంటనే అమెరికా రావాలంటూ ఆయా కంపెనీలు అల్టిమేటం ఇచ్చాయి. దీంతో అలాంటివాళ్లు అందరూ ఇప్పుడు హై టెన్షన్ పడుతున్నారు.