- ఫోన్ కాల్ రికార్డులు ఉండాల్సిందే..
- కొత్త రూల్స్‌ను ప్రతిపాదించిన ఆర్బీఐ
న్యూడిల్లీ: లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేలా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు నియమించుకునే రికవరీ ఏజెంట్లకు శిక్షణ తప్పనిసరి చేస్తూ గురువారం కొత్త ముసాయిదా నిబంధనలు విడుదల చేసింది. లోన్ తీసుకున్న వారితో ఏజెంట్లు మాట్లాడే ప్రతి ఫోన్ కాల్ రికార్డ్ చేయాలని బ్యాంకులను ఆదేశించింది. ఏజెంట్లు వినియోగదారులతో గౌరవంగా ప్రవర్తించాలని స్పష్టం చేసింది.
తిట్టడం లేదా అనుచిత సందేశాలు పంపడం వంటివి చేయకూడదు. ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు లేదా పెళ్లిళ్లు, పండుగలు వంటి సమయాల్లో లోన్ రికవరీ కోసం వెళ్లకూడదు. ఏజెంట్లు ఐఐబీఎఫ్ నిర్వహించే డెట్ రికవరీ శిక్షణను కచ్చితంగా పూర్తి చేయాలి. వినియోగదారుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా బ్యాంకులు జాగ్రత్తలు తీసుకోవాలి.
గతంలో జరిగిన కొన్ని వేధింపుల ఘటనల నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ కఠిన నిబంధనలను ప్రతిపాదించారు. రికవరీ ఏజెంట్ల వివరాలను బ్యాంకులు ముందుగానే తనిఖీ చేయాలని ఆర్బీఐ పేర్కొంది.
