జీవాల కాటుతో ఆస్పత్రిపాలు.. ఏడాదిన్నరలో 2,717 మంది పేషెంట్లు

జీవాల కాటుతో ఆస్పత్రిపాలు.. ఏడాదిన్నరలో 2,717 మంది పేషెంట్లు
  • ఒక్క ఆగస్టులోనే 257 మందికి గాయాలు
  • తప్పనిసరిగా ట్రీట్​మెంట్​ తీసుకోవాలంటున్న డాక్టర్లు
  • యాదాద్రి జిల్లాలో ఇదీ పరిస్థితి

యాదాద్రి, వెలుగు:  పిల్లి, పాము, ఎలుక.. ఈ మూడు జీవాల కారణంగా యాదాద్రి జిల్లాలోని పలువురు ఆస్పత్రిపాలవుతున్నారు. ఎలుకల బాధ నుంచి తప్పించుకునేందుకు పిల్లులను పెంచుకుంటే అవి దాడి చేస్తున్నాయి. హెల్త్ డిపార్ట్​మెంట్​లెక్కల ప్రకారం.. జిల్లాలో 2024 జనవరి నుంచి 2025 జులై వరకు పిల్లుల దాడిలో 649 మంది గాయపడి చికిత్స పొందారు. పిల్లి లాలాజలం చర్మంలోకి ఇంజక్షన్​ మాదిరిగా చొచ్చుకెళ్లడం వల్ల బాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. 

దీనివల్ల రక్తం ఇన్​ఫెక్షన్  అవుతుంది. చలి జ్వరంతోపాటు ఫ్లూ తరహా లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్లు తెలిపారు. 24 గంటల నుంచి 48 గంటల్లోగా ట్రీట్​మెంట్​చేయించుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే రోగ నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం ఉంటుందని అంటున్నారు.

ఎలుక, ఇతర జీవులు..

ఎలుక, సుందెలుక వంటివి ప్రజలను కొరుకుతున్నాయి. జెర్రి వంటివి కుడుతున్నాయి. వీటి వల్ల 1,373 మంది గాయపడి ప్రభుత్వ హాస్పిటల్స్​లో చికిత్స చేయించుకున్నారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. గతేడాది జనవరి నుంచి డిసెంబర్​ వరకు 275 మందిని.. ఈ ఏడాది ఇప్పటివరకు 1,098 మందిని గాయపరిచాయి. వీరిలో ఒక్క జులై నెలలోనే 777 మంది గాయపడ్డారు. ఎలుక కరిస్తే హాంటావైరస్ వ్యాపించే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. ట్రీట్​మెంట్ పొందకుంటే జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, శ్వాసకోశ సమస్యలకు దారితీయవచ్చని పేర్కొన్నారు. 

440 మందికి పాముకాటు

పాము లేదా తేలు కాటుకు గురైన వారి సంఖ్య తక్కువేమీ లేదు. ఈ ఏడాది జులై వరకు 440 మంది తేలు లేదా పాము కాటుకు గురై ట్రీట్​మెంట్ పొందారు. ఆర్థిక పరిస్థితి బాగా లేని వాళ్లు ప్రభుత్వ హాస్పిటల్స్​కు వెళ్తుంటే.. స్థితిమంతులు ప్రైవేట్ఆస్పత్రులకు వెళ్తున్నారు. గవర్నమెంట్​దవాఖానకు వెళ్లేవారి సంఖ్య తెలుస్తున్నా.. ప్రైవేట్​హాస్పిటల్స్​కు వెళ్లి చికిత్స పొందేవారి లెక్కలు తెలియడం లేదు.

ఆగస్టులో 257 మంది..

ఒక్క ఆగస్టులోనే పిల్లి, పాము, ఎలుక సహా ఇతర ప్రాణుల కారణంగా 257 మందికి గాయాలయ్యాయి. ఇందులో పిల్లి కారణంగా 68, పాముల కారణంగా 112 మంది, ఎలుక సహా ఇతర ప్రాణుల కారణంగా 77 మంది గాయపడి చికిత్స పొందారు.

ప్రజలు బెంబేలు

కుక్కల దాడిలో నిత్యం ఎక్కడో ఒకచోట ప్రజలు గాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లులు, ఎలుకలు కూడా దాడి చేస్తుండటంతో వారు బెంబేలెత్తుతున్నారు. పిల్లి కొరికినా, ఎలుక కరిచినా, పాము కాటు వేసినా, తేలు, జెర్రి కుట్టినా 21 రోజుల్లో ఐదుసార్లు ఇంజక్షన్​ తీసుకోవాల్సి ఉంటుంది. పాము, తేలు కాటు ఎక్కువ ప్రమాదకరం. కాటు వేసిన జాతిని బట్టి సీరియస్​నెస్​ఉంటుంది. అయితే పిల్లి, ఎలుక, పాము, తేలు వల్ల గాయపడిన వారిలో ఎవరూ చనిపోలేదని హెల్త్ డిపార్ట్​మెంట్​చెబుతోంది.

‘పిల్లే కదా.. అని ఓ వ్యక్తి దాన్ని ఇంట్లో నుంచి వెల్లగొట్టడానికి చెయ్యెత్తాడు. కొడుతున్నాడుకొని ఆ పిల్లి అతడిపై దూకింది. పంజాతో చేతి మీద గీరి, కొరికేసింది. గాయాలతో హాస్పిటల్​కు వెళ్లిన అతడిని ఏం జరిగిందని అక్కడున్నవారు ప్రశ్నించడంతో విషయం చెప్పాడు. కరిచింది పిల్లే కదా అని వాళ్లు నవ్వేశారు.

‘ఓ యువకుడు ఇంట్లో పడుకున్నాడు. ఎలుక వచ్చి అతడి కాలి వేలును కొరికింది. గాయమవడంతో హాస్పిటల్​కు వెళ్లి వైద్యం చేయించుకున్నాడు.’

యాదాద్రి జిల్లాలో బాధితుల వివరాలు

నెల                    పిల్లి    పాము    ఎలుక, ఇతర
జనవరి                53        122              47
ఫిబ్రవరి              41         21               28
మార్చి                 50         41               58
ఏప్రిల్​                 45         39               47
మే                       43         26               81
జూన్​                   48         66               60
జూలై                  72        125             777
ఆగస్టు                 68        112              77