సినీ ఇండస్ట్రీలో సెన్సార్ కష్టాలు అన్ని ఇన్ని కాదు. ఏ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా.. సీన్స్ కట్ చేయాల్సిందే, పేర్లు మార్చాల్సిందే. ఈ విషయంలో చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అన్న తేడా లేదు. అయితే ఇటీవల టైటిల్స్ విషయంలో సెన్సార్ బోర్డ్ పెడుతున్న నిబంధనలు ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. లేటెస్ట్ గా యువ నటుడు సుహాస్ నటించిన చిత్రం కూడా సెన్సార్ వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశమైంది.
హే భగవాన్ కాదు.. 'హే బలవంత్'!
'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' వంటి వైవిధ్యమైన సినిమా తర్వాత సుహాస్, శివాని నగరం జంటగా నటించిన చిత్రం 'హే భగవాన్!'. గోపీ అచ్చర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచీ అంచనాలు మెండుగానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ చేసే బిజినెస్ ఏంటో కనిపెట్టమని మేకర్స్ పెట్టిన కాంటెస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
అయితే, విడుదలకు కేవలం నాలుగు రోజుల ముందు సెన్సార్ బోర్డ్ ఈ చిత్ర టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. దైవ ప్రార్థనలా ఉన్న ఈ పేరును మార్చాలని సూచించడంతో, చేసేదేమీ లేక చిత్ర యూనిట్ టైటిల్‌ను 'హే బలవంత్!'గా మార్చేసింది. ఇదే పేరుతో ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
వరుసగాసెన్సార్ షాకులు
కేవలం సుహాస్ సినిమానే కాదు, ఇటీవల మరికొన్ని చిత్రాలు కూడా ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొన్నాయి. సంతోష్ శోభన్ హీరోగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ (Couple Friendly) మూవీకి రొమాంటిక్ టైటిల్ పెట్టడం సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ 'ఏ' సర్టిఫికేట్ ఇచ్చింది. టైటిల్‌ను 'ఫ్రెండ్లీ కపుల్'గా మార్చాలని కోరినప్పటికీ, మేకర్స్ దానికి అంగీకరించలేదు. గత నెలలో 'వానర' అనే చిన్న సినిమా కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొని, చివరి నిమిషంలో తన పేరును 'వానవీర'గా మార్చుకోవాల్సి వచ్చింది.
'హే బలవంత్!' మూవీని త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రైటర్ పద్మభూషణ్ ఫేమ్ షణ్ముఖ ప్రశాంత్ కథను అందించారు. సుదర్శన్, అన్నపూర్ణమ్మ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. టైటిల్ మారినా, కథలో ఉన్న బలం సినిమాను విజయతీరాలకు చేరుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఏ సినిమాకైనా టైటిల్ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ లాంటిది. అలాంటిది రిలీజ్ కి ముందు ఇలా టైటిల్స్ మార్చాల్సి రావడం ప్రమోషన్లపై ప్రభావం చూపుతుందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
