డిగ్రీ ఏదైనా ఏఐతో సాఫ్ట్‌వేర్ కోడింగ్ రాయొచ్చు.. TCS క్రేజీ ఏఐ హ్యాకథాన్‌.. ఢిల్లీ సమ్మిట్‌లో ఫైనల్స్

డిగ్రీ ఏదైనా ఏఐతో సాఫ్ట్‌వేర్ కోడింగ్ రాయొచ్చు.. TCS క్రేజీ ఏఐ హ్యాకథాన్‌.. ఢిల్లీ సమ్మిట్‌లో ఫైనల్స్

సాఫ్ట్‌వేర్ కోడింగ్ రాయడానికి ఇకపై కంప్యూటర్ సైన్స్ డిగ్రీ అక్కర్లేదు.. కేవలం క్రియేటివిటీ, థింకింగ్ ఉంటే చాలంటోంది దేశీయ టెక్ దిగ్గజ కంపెనీ TCS. కోడింగ్ ప్రపంచంలో ప్రస్తుతం నడుస్తున్న 'వైబ్ కోడింగ్' ట్రెండ్‌ను అందిపుచ్చుకుంటూ.. ఇంజనీరింగ్ నేపథ్యం లేని విద్యార్థుల కోసం టీసీఎస్ సరికొత్త ఏఐ హ్యాకథాన్‌ను నిర్వహిస్తోంది. టెక్ పరిజ్ఞానం లేని వారు కూడా ఏఐ సాయంతో అద్భుతాలు సృష్టించవచ్చని ఈ కార్యక్రమం చాటిచెబుతోంది.

జనవరి 26, 2026 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఈ హ్యాకథాన్ సాటిలైట్ ఎడిషన్లలో ఇప్పటివరకు 10వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. విశేషమేమిటంటే.. ఇందులో పాల్గొన్న వారంతా ఆర్ట్స్, కామర్స్, నర్సింగ్, అగ్రికల్చర్, క్రిమినాలజీ, లా వంటి నాన్-టెక్నికల్ కోర్సులు చదువుతున్న వారే. కేరళ, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతో సహా 10 రాష్ట్రాల్లోని 22 కళాశాలల్లో ఈ పోటీలు జరిగాయి. ఈ విద్యార్థులు తమ తమ రంగాల్లో ఎదురవుతున్న వాస్తవ సమస్యలకు ఏఐ ఆధారిత పరిష్కారాలను రూపొందించారు ఏఐ టూల్స్ సహాయంతో. దీనికి సంబంధించిన చివరి రౌండ్ ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కార్యక్రమంలో నిర్వహించాలని టీసీఎస్ నిర్ణయించింది. 

సాధారణంగా ఒక సాఫ్ట్‌వేర్ ప్రోటోటైప్ తయారు చేయడానికి ఎంతో టెక్ నైపుణ్యం అవసరం. కానీ ఈ హ్యాకథాన్‌లో పాల్గొన్న విద్యార్థులు కేవలం 90 నుంచి 120 నిమిషాల వ్యవధిలోనే ఫంక్షనల్ ప్రోటోటైప్‌లను సిద్ధం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. వాయిస్-ఫస్ట్ ఏఐ టూల్స్ వాడటం వల్ల కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా.. భాషా పరిజ్ఞానం అడ్డంకి కాదని నిరూపితమైంది. దీనిపై టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ క్రిష్ స్పందిస్తూ.. ఏఐ వల్ల నైపుణ్యాల మధ్య ఉన్న అంతరం తగ్గుతుందని, ప్రతి ఒక్కరూ డిజిటల్ వ్యవస్థాపకులుగా మారే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ ప్రయాణం ఫిబ్రవరి 17, 2026న ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే 'టాటా భారత్ యువ ఏఐ హ్యాకథాన్'తో పరాకాష్టకు చేరుకోనుంది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో భాగంగా జరిగే ఈ మెగా ఈవెంట్‌లో సుమారు 2వేల మంది విద్యార్థులు పాల్గొంటారు. నిపుణుల పర్యవేక్షణలో.. ఏఐ రివ్యూతో జరిగే ఈ పోటీలు AI for All అనే భారత ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఉన్నాయి. కోడింగ్ అంటే కేవలం ఇంజనీర్లకే పరిమితం కాదని.. సామాన్యుడు కూడా ఏఐని తన ఆయుధంగా మార్చుకోవచ్చని టీసీఎస్ పోటీలు స్పష్టం చేస్తున్నాయి.