
శుక్రవారం (సెప్టెంబర్ 19) ఒమన్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసింది. ఎవరైనా జట్టు కోసం ఒకటి లేదా రెండు స్థానాలు త్యాగం చేసి బ్యాటింగ్ ఆర్డర్ లో కిందకు వస్తారు. కానీ సూర్య మాత్రం చాలా భిన్నం. ఏకంగా 11 వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి సిద్ధపడ్డాడు. వినడానికి షాకింగ్ గా ఉన్నప్పటికీ ఇది నిజం. అబుదాబి వేదికగా షేక్ జాయెద్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ కు రాకపోవడం విశేషం.
టీమిండియా 8వ వికెట్ కోల్పోయిన సూర్య డగౌట్ లో ప్రశాంతంగా కూర్చున్నాడు. సాధారణంగా సూర్య మూడో స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం సూర్య ఎన్ని వికెట్లు పడుతున్నా బ్యాటింగ్ కు దిగలేదు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడని భావించినా హర్షిత్ రానాను బ్యాటింగ్ కు పంపాడు. ఆ తర్వాత 9 వ స్థానంలో కుల్దీప్ యాదవ్.. పదో స్థానంలో అర్షదీప్ సింగ్ బ్యాటింగ్ కు వచ్చాడు. ఈ మ్యాచ్ బ్యాటింగ్ ఆర్డర్ లో గందరగోళం నెలకొంది. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సిన శాంసన్ మూడో స్థానంలో బ్యాటింగ్ కు వస్తే లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయాల్సిన పాండ్య నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే సంజు శాంసన్ (56) హాఫ్ సెంచరీకి తోడు అభిషేక్ శర్మ (38), తిలక్ వర్మ (29) మెరుపులు మెరిపించడంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులకు చేసింది. 56 పరుగులు చేసిన సంజు శాంసన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఒమన్ బౌలర్లలో అమీర్ కలీం, షా ఫైసల్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. అభిషేక్ శర్మ ధనాధన్ బౌండరీలతో అలరించగా.. అక్షర్ పటేల్ 26 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. గిల్ (5), పాండ్య (1) సింగిల్ డిజిట్ కే ఔటయ్యారు.