
ఇస్లామాబాద్: పాకిస్తాన్-సౌదీ అరేబియా మధ్య ఇటీవల కుదిరిన వ్యూహాత్మక రక్షణ ఒప్పందంపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త భద్రతా ఒప్పందం ప్రకారం.. ఒకవేళ ఇండియా మాపై దాడి చేస్తే సౌదీ అరేబియా పాకిస్తాన్‌కు రక్షణగా నిలుస్తుందని అన్నారు. పాక్పై భారత్ యుద్ధానికి కాలు దువ్వితే కచ్చితంగా సౌదీ అరేబియా జోక్యం చేసుకుంటుందని.. ఇందులో ఎటువంటి సందేహం లేదని ప్రగల్భాలు పలికారు. కొత్త భద్రతా ఒప్పందం ప్రకారం.. పాకిస్తాన్, సౌదీ అరేబియా రెండు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా దానిని రెండు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తామని చెప్పారు.
ఈ ఒప్పందం ఒక్క ఇండియా కోసమే కాదని.. బాహ్య దురాక్రమణ నుంచి రెండు దేశాలను రక్షించడానికి రూపొందించబడిన అగ్రిమెంట్ అని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని కూడా పాకిస్తాన్, సౌదీ అరేబియా సంయుక్తంగా ఎదుర్కొంటాయని తెలిపారు. ఈ ఒప్పందం పూర్తిగా రక్షణాత్మకమైనదని.. ఇది ఏ దేశంపైనా దాడి చేయడానికి కాదని చెప్పారు. ఈ ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ అణు ఆయుధాలను సౌదీ అరేబియా ఉపయోగించుకోవచ్చని తెలిపారు.
ALSO READ : భారత్ దెబ్బకు దుకాణం సర్దిన టెర్రరిస్టులు..
సౌదీ, పాక్ ఒప్పందం ఏంటంటే..?
పాకిస్తాన్-సౌదీ అరేబియా మధ్య ఇటీవల వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. పాకిస్తాన్, సౌదీ అరేబియా రెండు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా దానిని రెండు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. పాక్పై ఏ దేశమైనా దాడి చేస్తే సౌదీ అరేబియా జోక్యం చేసుకుంది. సౌదీ అరేబియాపై దాడి జరిగితే పాక్ అండగా ఉంటుంది. అంతేకాకుండా పాకిస్తాన్ అణ్వాయుధాలను కూడా సౌదీ అరేబియా ఉపయోగించుకోవచ్చు. ఈ ఒప్పందంలో పాక్ అణ్వాయుధాలను సౌదీ అరేబియా ఉపయోగించుకునే అంశం వివాదస్పదంగా మారింది. దీనిపై పలు ఆసియా దేశాలు అభ్యంతరం తెలుపుతున్నాయి.