ఒక దేశానికి ఇంత కంటే అవమానం ఏముంటుందీ.. ప్రతి దానికీ అడుక్కోవటం మొదలైతే ఇంత కన్నా విలువ ఎవరిస్తారు.. పక్క దేశంపై ఏడుపులు, పెడబొబ్బులు.. దాడులు.. కుట్రలు, విధ్వంసంతో నిత్యం హింసతో బతికే దేశానికి ఇంత కంటే గౌరవం ఎవరిస్తారు.. ఇవన్నీ మన పక్కనే ఉన్న పాకిస్తాన్ దేశం గురించే.. పాకిస్తాన్ దేశాన్ని టాయిలెట్ పేపర్ కంటే నీచంగా.. నీచాతి నీచంగా చూస్తున్నారంట..ఈ మాటలు వాళ్లు వీళ్లు అనటం కాదు.. పాకిస్తాన్ దేశ రక్షణ మంత్రి.. స్వయంగా పాక్ పార్లమెంట్లో ఏడుస్తూ చెప్పిన మాటలు.. పాకిస్తాన్ దేశం గౌరవం అమెరికా దగ్గర ఎలా ఉంది అంటే.. టాయిలెట్ పేపర్.. టిష్యూ పేపర్ కంటే నీచంగా ఉందంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.
పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ ఖవాజా ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా షాకింగ్ కామెంట్స్ చేశారు. అమెరికా తన సొంత ప్రయోజనాల కోసం పాకిస్తాన్‌ను టాయిలెట్ పేపర్ కంటే దారుణంగా వాడుకుని వదిలేసిందని వాపోయారు. అమెరికాతో సత్సంబంధాలు పాకిస్తాన్‌ను బలహీనపరిచి అస్థిరంగా మార్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 1999 తర్వాత అమెరికాతో కలిసి పనిచేయాలని పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం దేశానికి తీవ్ర నష్టాన్ని కలిగించిందని అన్నారు.
►ALSO READ | ఖమేనీతో డీల్ వద్దు.. అటాక్ చేయండి.. ట్రంప్ కు ఇరాన్ యువకుడి విజ్ఞప్తి
పాకిస్తాన్ ఎప్పుడూ తమకు సంబంధం లేని యుద్ధాల్లోకి లాగబడిందని ఆయన బహిరంగంగా అంగీకరించారు. ఆప్ఘాన్పై అమెరికా చేసిన యుద్ధానికి పాక్ మద్దతు ఇవ్వడం ద్వారా తాలిబన్లకు పాకిస్తాన్ వ్యతిరేకంగా మారిందని ఒప్పుకున్నారు. అమెరికా చివరికి ఈ ప్రాంతం నుండి వైదొలగడంతో పాకిస్తాన్ దీర్ఘకాలిక హింస, తీవ్రవాదం, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోందన్నారు.
అమెరికాను సంతృప్తి పరచడానికే పాక్ మాజీ సైనిక పాలకులు జియా-ఉల్-హక్, పర్వేజ్ ముషారఫ్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో చేరారని పేర్కొన్నారు. మనం ఎదుర్కొన్న నష్టాలను ఎప్పటికీ భర్తీ చేయలేమని.. పాకిస్తాన్ చేసిన తప్పులను తిరిగి మార్చలేనివి అని అన్నారు. ఇటీవల అమెరికాతో పాక్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ఈ క్రమంలో అమెరికాకు వ్యతిరేకంగా పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా బహిరంగంగా కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఖవాజా కామెంట్స్ పై అగ్ర రాజ్యం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.
