- వేలాది మందిని చంపేశారు.. ఇరాన్ ప్రజలకు సాయం చేయాలని పిలుపు
- తాను చనిపోతున్నానంటూ వీడియో మెసేజ్ విడుదల
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సర్కారుతో ఎలాంటి డీల్ కుదుర్చుకోవద్దని, ఇరాన్ పై అటాక్ చేయాలంటూ ఇరాన్ యువకుడు ఒకరు విడుదల చేసిన వీడియో మెసేజ్ వైరల్ అయింది. తమ దేశంలో ఇప్పటికే 40 వేల మంది నిరసనకారులను చంపేశారని.. ఈ వీడియోను ప్రపంచం చూసే సమయానికి తాను కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటానని అతడు వెల్లడించాడు.
వీడియో మెసేజ్ రిలీజ్ చేసిన యువకుడు దక్షిణ ఇరాన్ లోని బుషెహర్ కు చెందిన పౌరియా హమీదీ అని, ఈ వీడియోను రిలీజ్ చేసిన తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడని ‘ఇరాన్ ఇంటర్నేషనల్’ మీడియా సంస్థ వెల్లడించింది.
పది నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఇరాన్ లో నెలకొన్న దారుణ పరిస్థితిని హమీదీ ఇంగ్లిష్ లో వివరించాడు. ‘‘మా దుస్థితి గురించి అంతర్జాతీయ సమాజం దృష్టికి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. రష్యా, ఉక్రెయిన్.. పాలస్తీనా, ఇజ్రాయెల్ కన్నా ఎక్కువగా ఇరాన్ లో మారణహోమం జరిగింది.
సాధారణ ప్రజలం ఆయుధాలు పట్టి పోరాడలేం. మాకు అంతర్జాతీయ మద్దతు కావాలి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, ఇతర వెస్ట్రన్ దేశాలు ఇరాన్ పై దాడి చేయడమొక్కటే మా పోరాటానికి మిగిలి ఉన్న మార్గం. ఖమేనీ సర్కారుతో చర్చలు జరపొద్దు. డీల్ కుదుర్చుకోవద్దు. అలా చేస్తే.. నిరసనల్లో చనిపోయిన వేలాది మందిని మోసం చేసినట్టే అవుతుంది.
పోరాటం కొనసాగించాలని, అండగా ఉంటామని ట్రంప్ చెప్పిన మాటల్ని నమ్మి, ప్రాణాలను పణంగా పెట్టి నిరసనలు కొనసాగించాం. ఇప్పుడు ఇరాన్ పై అమెరికా దాడి చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఇరాన్ బయట ఉన్న ఇరానియన్ సంఘాలన్నీ ఒక్కటి కావాలి. అమెరికాలో ప్రవాసంలో ఉన్న ప్రిన్స్ రెజా పహ్లావీ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి” అని హమీదీ కోరాడు.
ఇరాన్ లో ప్రస్తుతం ఖమేనీ పాలనలో తమ జీవితాలు అగమ్య గోచరంగా మారాయని, తాము ఒంటరులమైపోయామని.. ఎలాంటి భవిష్యత్తు కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
