జీసీసీకి జీవం.. కాలానుగుణంగా మార్పు చెందుతున్న గిరిజన సహకార సంస్థ

జీసీసీకి జీవం.. కాలానుగుణంగా మార్పు చెందుతున్న గిరిజన సహకార సంస్థ
  • తెలంగాణ ఏర్పాటు తర్వాత రూ. 88 కోట్ల నుంచి రూ. 378 కోట్లకు పెరిగిన వ్యాపారం
  • 31 బంక్‌‌‌‌‌‌‌‌ల ఏర్పాటుతో ఏటా రూ.200 కోట్ల టర్నోవర్‌‌‌‌‌‌‌‌
  • గిరిజన బజార్లతో పెరిగిన అటవీ ఉత్పత్తుల అమ్మకాలు

హైదరాబాద్, వెలుగు : ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన గిరిజన సహకార సంస్థ (జీసీసీ) మళ్లీ జీవం పోసుకుంటోంది. ఒకానొక దశలో మూతపడే స్థితికి చేరుకున్న సదరు సంస్థ మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు చెందుతూ తన వ్యాపారాన్ని రెట్టింపు చేసుకుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఏటా రూ. 88 కోట్ల వ్యాపారం చేసే దశ నుంచి ఇప్పుడు రూ. 378 కోట్ల వ్యాపారం చేసే స్థాయికి చేరింది.

 మారుమూల గిరిజన ప్రాంతాల్లో 31 పెట్రోల్‌‌‌‌‌‌‌‌ బంక్‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటు చేసి ఏటేటా రూ. 200 కోట్ల వ్యాపారం చేస్తోంది. గిరి బజార్లతో స్వదేశీ ఉత్పత్తులను రూపొందిస్తూ నాణ్యమైన సరుకులను ఆదివాసీయేతర ప్రజలకు విక్రయిస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ గురుకులాలకు నాణ్యమైన సరుకులు అందిస్తూ విద్యార్థుల ఆరోగ్యకరమైన జీవనానికి తోడ్పాడు అందిస్తోంది. వందలాది మంది ఆదివాసీ గిరిజనులకు ఉపాధి కల్పిస్తోంది. 

కాలనుగుణంగా మారిన సంస్థ

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని విశాఖపట్టణం కేంద్రంగా 1956లో గిరిజన సహకార సంస్థ (జీసీసీ)ను ఏర్పాటు చేశారు. దట్టమైన అడవుల్లోని మారుమూల ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ గిరిజనుల జీవనం కోసం ఈ సంస్థ పనిచేస్తోంది. గిరిజనులు అడవుల నుంచి సేకరించే విలువైన అటవీ ఉత్పత్తులను తక్కువ ధరకు కొంటూ వ్యాపారులు చేసే మోసాన్ని అరికట్టడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. 

అటవీ ఉత్పత్తులను కొనడం, మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ చేయడం, గిరిజనులకు అవసరమైన నిత్యావసర సరుకులు అందించడం వంటి పనులను ఈ సంస్థ చేస్తోంది. తొలినాళ్లలో రోడ్లు, రవాణా సౌకర్యం బాగాలేని కాలంలో జీసీసీ ఉద్యోగులు అందించే వస్తువులే ఆదివాసీ గిరిజనులకు జీవనాధారంగా ఉండేది. వారు నదులు, వాగులు, కాల్వలు దాటుకుంటూ వెళ్లి సరుకులు అందించేవాళ్లు. కాలక్రమేణా అడవుల్లో కూడా రోడ్లు వేయడం, బ్రిడ్జిలు కట్టడం, రవాణా మెరుగుపడడంతో జీసీసీ పాత్ర తగ్గుకుంటూ వచ్చింది. 

గిరిజనులకు కూడా అన్ని రకాల నిత్యావసర సరుకులుఅందుబాటులోకి వచ్చాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థగా పేరు మారింది. రాష్ట్రంలో 31 లక్షల మంది గిరిజన జనాభా ఉంది. ఇది రాష్ట్ర జనాభాలో సుమారు 9.08 శాతానికి సమానం. రాష్ట్రంలో ప్రధానంగా గోండు, కోయ, బంజారా, చెంచు, ప్రథాన్, లంబాడా తదితర గిరిజన తెగలు నివసిస్తున్నాయి. 

జీసీసీ పరిధిలో మూడు డివిజనల్ కార్యాలయాలు, 18 జీపీసీఎం సొసైటీలు ఉన్నాయి. అలాగే భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూరు ఐటీడీఏల కింద 447 డీఆర్‌‌‌‌‌‌‌‌ డిపోలు పనిచేస్తున్నాయి. ఇందులో 312 రెగ్యులర్, 135 సబ్‌‌‌‌‌‌‌‌ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 2.31 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం అందించే పీడీఎస్ బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తోంది. 

25 రకాల అటవీ ఉత్పత్తుల సేకరణ

రాష్ట్రంలో ఆదివాసీ గిరిజనులు సేకరించే 25 రకాల అటవీ ఉత్పత్తులను జీసీసీ కొనుగోలు చేసి మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. వీటిలో ఎక్కువగా తేనె, ఇప్పపువ్వు, విషముష్టి గింజలు, చిల్ల గింజలు, కుంకుడుకాయలు, ఇప్ప పరక, గానుగ పప్పు వంటి వాటిని గిరిజనులు ఎక్కువగా అడవుల నుంచి సేకరిస్తారు. 

వీటితో పాటు అటవీ ప్రాంతంలో గిరిజనులు పండించే ధాన్యం, మిర్చి, పసుపు తదితర పంటలను కూడా జీసీసీ కొనుగోలు చేసి మార్కెంటింగ్ చేస్తోంది. రాష్ట్ర ప్రజలకు నాణ్యతతో కూడిన సరుకులు అందించాలన్న లక్ష్యంతో గిరి బజార్లను ఏర్పాటు చేసింది. ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి అటవీ ఉత్పత్తులను కొని ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ చేసి బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌ ద్వారా ప్రజలకు విక్రయిస్తోంది. 

31 పెట్రోల్ బంక్‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటు

ఆదివాసీ గిరిజన గ్రామాల్లో వ్యవసాయం ఊపందుకోవడంతో ట్రాక్టర్లు, డీజిల్‌‌‌‌‌‌‌‌ ఇంజిన్లు, టూ వీలర్ల వాడకం పెరిగింది. దీంతో పెట్రోల్‌‌‌‌‌‌‌‌ బంక్‌‌‌‌‌‌‌‌ల ఏర్పాటుకు జీసీసీ నిర్ణయించింది. 2018లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో మొదటి పెట్రోల్ బంక్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశారు. వ్యాపారం లాభసాటిగా మారడంతో పాటు స్థానిక గిరిజనులకు ఉపాధి దొరుకుతుండడంతో ఏటేటా బంక్‌‌‌‌‌‌‌‌ల సంఖ్యనుపెంచుకుంటూ పోయారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో భద్రాచలం ఐటీడీఏ పరిధిలో 7, ఏటూరునాగారం పరిధిలో 13, ఉట్నూరు పరిధిలో 11 కలిపి మొత్తం 31 పెట్రోల్‌‌‌‌‌‌‌‌ బంక్‌‌‌‌‌‌‌‌లు పనిచేస్తున్నాయి. ఈ ఏడాది మరో ఐదు బంకుల ఏర్పాటుకు ప్రతిపాదనలు రెడీ చేశారు. ప్రతీ యేటా రూ.200 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుండగా.. 200 మందికి పైగా స్థానిక గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. 

ప్రభుత్వ గురుకులాలకు నిత్యావసర వస్తువుల సరఫరా

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన నిత్యావసర సరుకులు, కాస్మోటిక్స్ సరఫరా చేసే బాధ్యతను 2009–10 నుంచి జీసీసీ తీసుకుంది. ఇల్లందు దగ్గర పసుపు, మిర్చి పౌడర్‌‌‌‌‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌ యూనిట్ నెలకొల్పింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన మిర్చి, పసుపును పౌడర్‌‌‌‌‌‌‌‌గా మార్చి గురుకులాలకు సప్లై చేయడంతో పాటు బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోనూ విక్రయిస్తోంది. 

ప్రతీ యేటా రూ.75 కోట్ల కల్తీ లేని నాణ్యతతో కూడిన సరుకులను అందిస్తోంది. నిర్మల్‌‌‌‌‌‌‌‌లో తేనె ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌ యూనిట్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసి గిరి బ్రాండ్ ద్వారా నాణ్యమైన తేనెను సప్లై చేస్తోంది. నిర్మల్‌‌‌‌‌‌‌‌లో సబ్బుల తయారీ కోసం సోప్ మేకింగ్‌‌‌‌‌‌‌‌ యూనిట్ ఏర్పాటు చేసి రోజుకు 10 వేల సోప్స్ రెడీ చేస్తోంది. అన్ని యూనిట్లలో కలిపి 100 మందికి పైగా స్థానిక గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. దీంతో పాటు ప్రతీ యేటా వర్షాకాలం, యాసంగిలో వడ్ల కొనుగోళ్ల ద్వారా రూ. 100 కోట్ల వ్యాపారం చేస్తోంది.

ఏటా రూ.378 కోట్ల వ్యాపారం చేస్తున్నాం 

రాష్ట్రంలో జీసీసీ ద్వారా ప్రతీ యేటా రూ.378 కోట్ల వ్యాపారం చేస్తున్నాం. తెలంగాణ ఏర్పడినప్పుడు రూ. 88 కోట్ల వ్యాపారం జరిగేది. ఇప్పుడు అది నాలుగింతలు పెరిగింది. నిర్మల్, ఇల్లందులో పలు రకాల ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాం. రాష్ట్ర వ్యాప్తంగా 31 పెట్రోల్ బంక్‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటు చేసి గిరిజనులకు కల్తీలేని పెట్రోల్, డీజిల్‌‌‌‌‌‌‌‌ అందిస్తున్నాం. అన్ని చోట్ల స్థానిక గిరిజన యువతకే ఉపాధి కల్పిస్తున్నాం. దీంతో పాటు ప్రతి నెల 2.31 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఉచిత సన్నబియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు అందజేస్తున్నాం.- సీతారాం, 
జనరల్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌, జీసీసీ హైదరాబాద్