IND vs OMA: ఓడినా వణికించారు.. ప్రయోగాలతో ఒమన్‌పై కష్టపడి గెలిచిన టీమిండియా

IND vs OMA: ఓడినా వణికించారు.. ప్రయోగాలతో ఒమన్‌పై కష్టపడి గెలిచిన టీమిండియా

ఆసియా కప్ చివరి లీగ్ మ్యాచ్ లో ఒమన్ పై టీమిండియా విజయం సాధించింది. శుక్రవారం (సెప్టెంబర్ 19) అబుదాబి వేదికగా షేక్ జాయెద్ స్టేడియంలో ముగిసిన ఈ మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో టీమిండియా చెమటోడ్చి నెగ్గింది. మొదట బ్యాటింగ్ లో శాంసన్ (56) హాఫ్ సెంచరీ చేయగా.. బౌలింగ్ లో విఫలమైన టీమిండియా ఎట్టకేలకు గెలిచి ఈ టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులకు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో ఒమన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి ఓడిపోయింది. 

ఒమన్ అద్భుతమైన పోరాటం:

189 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఒమన్ కు ఓపెనర్లు సూపర్ స్టార్ట్ ఇచ్చారు. పటిష్టమైన భారత బౌలర్లను ఎదుర్కొని తొలి వికెట్ కు 8.3 ఓవర్లలో 56 పరుగులు చేసింది. వికెట్ కు ప్రాధాన్యమిచ్చిన ఒమన్ ఓపెనర్లు వేగంగా ఆడడంలో విఫలమయ్యారు. 32 పరుగులు చేసిన జతిందర్ ను బౌల్డ్ చేసి కుల్దీప్ యాదవ్ టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. ఈ దశలో హమ్మద్ మీర్జాతో కలిసి ఓపెనర్ అమీర్ కలీం మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో తొలి 14 ఓవర్లు ముగిసేసరికి ఒమన్ 100 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. 

15 ఓవర్ నుంచి టీమిండియాకు ఒమన్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. శివమ్ దూబే వేసిన 15 ఓవర్లో 16 పరుగులు.. కుల్దీప్ యాదవ్ వేసిన 16 ఓవర్లో 14 పరుగులు రావడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. చివరి 16 బంతుల్లో 40 పరుగులు చేయాల్సిన దశలో ఒమన్ షాక్ ఇచ్చేలా అనిపించింది. ఈ దశలో సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో ఒమన్ కూడా చేతులెత్తేసింది. ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్, హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్య తలో వికెట్ పడగొట్టారు.   

టీమిండియా భారీ స్కోర్: 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది. అయితే ఇండియాకు అనుకున్నంత గొప్ప ఆరంభం ఏమీ రాలేదు. రెండో ఓవర్లోనే గిల్ 5 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్లీన్ బౌల్డయ్యాడు. రెండో ఓవర్లో ఫైజల్ మేడిన్ ఓవర్ వేయడంతో తొలి రెండు ఓవర్లలో ఇండియా కేవలం ఆరు పరుగులు మాత్రమే చేయగలిగింది. మూడో ఓవర్ నుంచి ఇండియా స్కోర్ వేగంగా ముందుకెళ్లింది. ఓపెనర్ అభిషేక్ శర్మ తనదియాన్ మార్క్ షాట్లతో అలరించాడు. మరో ఎండ్ లో శాంసన్ కూడా వేగంగా ఆడడంతో ఇండియా పవర్ ప్లే లో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. 

15 బంతుల్లోనే 38 పరుగులు చేసి మంచి టచ్ లో కనిపించిన అభిషేక్ శర్మ దూకుడుగా ఆడే క్రమంలో ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 8 ఓవర్ మూడో బంతికి ఒమన్ పేసర్ జితెన్ రామనందిని వేసిన బంతిని శాంసన్ స్ట్రయిట్ షాట్ ఆడాడు. బౌండరీ ఆపే క్రమంలో నేరుగా వస్తున్న బంతి జితెన్ చేతికి తగిలి వికెట్లను తాకింది. బాల్ స్టంప్స్ కు తగిలే సమయంలో హార్దిక్ నాన్ స్ట్రైకింగ్ లో క్రీజ్ లో బ్యాట్ పెట్టలేదు. దీంతో కేవలం ఒక పరుగుకే పాండ్య ఔటయ్యాడు.   

ఈ దశలో సూర్య, అక్షర్ తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. నాలుగో వికెట్ కు 45 పరుగులు జోడించిన తర్వాత 13 బంతుల్లోనే 26 పరుగులు చేసిన అక్షర్ ఔటయ్యాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన శివమ్ దూబే 5 పరుగులే చేసి నిరాశపరిచాడు. శాంసన్, తిలక్ వర్మ కలిసి కాసేపు మెరుపులు మెరిపించి జట్టుకు భారీ స్కోర్ అందించిన తర్వాత పెవిలియన్ కు చేరారు. ఆఫ్గనిస్తాన్ బౌలర్లు విజృంభించడంతో చివరి మూడు ఓవర్లలో ఇండియా కేవలం 19 పరుగులు మాత్రమే చేయగలిగింది.