నేను మళ్లీ చెప్తున్నా.. ఇండియాకు అసమర్ధ ప్రధాని ఉన్నడు: H-1B వీసా ఫీజు పెంపుపై రాహుల్ గాంధీ రియాక్షన్

నేను మళ్లీ చెప్తున్నా.. ఇండియాకు అసమర్ధ ప్రధాని ఉన్నడు: H-1B వీసా ఫీజు పెంపుపై రాహుల్ గాంధీ రియాక్షన్

న్యూఢిల్లీ: H-1B వీసాలపై వార్షిక ఫీజును అమెరికా లక్ష డాలర్లకు పెంచడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయిన రాహుల్ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ అసమర్ధుడు అని.. ఆయన అసమర్ధత వల్లే భారతీయ ఉద్యోగులకు నష్టం కలిగే విధంగా H-1B వీసాలపై వార్షిక ఫీజును అమెరికా భారీగా పెంచిందని ఆరోపించారు. 2017లో ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‎తో H-1B వీసా ఫీజు అంశంపై ట్రంప్‎తో మోడీ ఎలాంటి చర్చలు జరపలేదు.

లక్షల మంది భారతీయ ఉద్యోగులు ఇబ్బందులు పడుతోన్న H-1B వీసా అంశంపై అమెరికా అధ్యక్షుడితో చర్చించకపోవడంతో అప్పట్లో ప్రధాని మోడీని అసమర్ధ నాయకుడు అని రాహుల్ గాంధీ విమర్శించారు. తాజాగా H-1B వీసాలపై వార్షిక ఫీజును అమెరికా లక్ష డాలర్లకు పెంచడంపై స్పందించిన రాహుల్ గతంలో మోడీ ఈ అంశాన్ని పట్టించుకోలేదనే విషయాన్ని గుర్తు చేస్తూ.. నేను మళ్లీ చెబుతున్నా ఇండియాకు అసమర్ధ ప్రధాని ఉన్నాడని విమర్శించారు. భారత ప్రయోజనాలను పరిరక్షించడంలో మోడీ విదేశాంగ విధానం విఫలమైందని.. ఆయనొక బలహీనమైనా నాయకుడిని అభివర్ణించారు. 

Also Read:-H1B వీసాపై ట్రంప్ నిర్ణయంతో కల్లోలం.. మోదీ తాజా వ్యాఖ్యలతో టెకీల్లో మరింత టెన్షన్

H-1B వీసాలపై వార్షిక ఫీజు పెంపుపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. H-1B వీసాదారులలో 70 శాతం మంది భారతీయులే ఉన్నారని.. H-1B వీసా ఫీజు పెంపు నిర్ణయంతో దేశ టెక్ వర్క్‌ఫోర్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. ఇటీవల ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఫోన్ చేసి విష్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. బర్త్ డే విషెస్ చెప్పిన తర్వాత ప్రధాని మోడీకి ట్రంప్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడని.. మోడీకి ఇచ్చిన బహుమతి భారతీయులను తీవ్రంగా బాధపెట్టిందని ఎద్దేవా చేశారు ఖర్గే. విదేశాంగ విధానం అంటే మన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడంతో పాటు ఇతర దేశాలతో స్నేహా సంబంధాలు కొనసాగించడమని హితవు పలికారు.