H1B వీసాపై ట్రంప్ నిర్ణయంతో కల్లోలం.. మోదీ తాజా వ్యాఖ్యలతో టెకీల్లో మరింత టెన్షన్

H1B వీసాపై ట్రంప్ నిర్ణయంతో కల్లోలం.. మోదీ తాజా వ్యాఖ్యలతో టెకీల్లో మరింత టెన్షన్

అహ్మదాబాద్: H1B వీసా ఫీజును అమెరికా భారీగా పెంచడంతో ఐటీ రంగంలో కల్లోలం రేగుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గుజరాత్లోని భావ్ నగర్లో ప్రధాని మోదీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఇతర దేశాలపై ఆధారపడటమే ప్రస్తుతం మన దేశానికి ఉన్న ప్రధాన శత్రువు అని చెప్పారు. ప్రపంచంలో ఇండియాకు ఇంతకు మించిన శత్రువు మరేదీ లేదని మోదీ వ్యాఖ్యానించారు. అందరం కలిసికట్టుగా ఈ శత్రువును జయించాలని మోదీ పిలుపునిచ్చారు. స్వయం వద్ధి ఒక్కటే ఇందుకు మార్గమని ఆయన తెలిపారు. అమెరికాలో H1B వీసాపై ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తీవ్ర చర్చనీయాంశమైన క్రమంలో ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.

హెచ్ 1బీ వీసాలు టెక్నాలజీ రంగంలో పనిచేసే వారికే ఎక్కువగా ఇస్తారు. దీంతో అమెరికాలోని ప్రముఖ కంపెనీలు హెచ్ 1 బీ వీసా ద్వారా విదేశాల నుంచి ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులే ఇందులో ఎక్కువగా ఉంటారు. ఇతర రంగాల్లోఉద్యోగం చేసేందుకు వెళ్లే వారైనా సరే హెచ్ 1 బీ వీసాతో పనిచేస్తూ ఇక్కడ రెసిడెన్షియల్ స్టేటస్ లేదా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తుంటారు. ఇలా హెచ్ 1 బీ వీసా ద్వారా అమెరికా వెళ్లే వారిలో ఇండియన్సే 70 శాతం ఉంటారు. అమెరికాలో హెచ్ 1 బీ వీసాపై పనిచేస్తున్న వారంతా ఉద్యోగం కోల్పోతే తర్వాత రెండు నెలల లోపు తిరిగి వేరే ఉద్యోగంలో చేరాలి. లేదంటే వీసా రెన్యువల్ చేసుకోవాలి.

అమెరికాలో H1B వీసాపై పనిచేస్తున్న ఉద్యోగుల కోసం కంపెనీలు ప్రతి ఏటా లక్ష డాలర్లు చెల్లించాల్సిందే... విదేశాలకు, స్వస్థలాలకు వెళ్లిన వారు రేపు అర్ధరాత్రి కల్లా అమెరికా రావాలి..' అంటూ ట్రంప్ సర్కారు శనివారం తెల్లవారు జామున ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆర్డర్స్ భారత్లో పెను ప్రకంపనలు రేపుతున్నా యి. అక్కడ పనిచేస్తున్న హెచ్ 1 బీ వీసా హోల్డర్లలో 72% మంది భారతీయులే కాపడమే ఇందుకు కారణం. చాలా మంది భారతీయులు ఈ వీసాల కిందే దశాబ్దాలుగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. వలస విధానాలపై కఠిన చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఈ నిర్ణయంతో ప్రధానంగా ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది.