వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనపై అమెరికన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన పాలన సరిగ్గా లేదని 57 శాతం మంది అమెరికన్లు చెప్పగా.. బాగుందని 43 శాతం మంది పేర్కొన్నారు. ట్రంప్ పాలనపై ఫాక్స్ న్యూస్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. ఒక్క బార్డర్ సెక్యూరిటీ విషయంలోనే ట్రంప్ పాలనను 52 శాతం మంది మెచ్చుకున్నారు.
ట్రంప్ వైఖరి వల్ల గత కొద్ది నెలలుగా నిత్యావసరాల ధరలు పెరిగి జీవన వ్యయం పెరిగిందని 67 శాతం మంది చెప్పగా.. 33 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆయనకు 35 నెగెటివ్ పాయింట్లు వచ్చాయి. టారిఫ్ల విషయంలో 27 పాయింట్లు, ఎకానమీ – హెల్త్ కేర్ లో 23, ఫారిన్ పాలసీ రేటింగ్ లో 20, ట్యాక్సుల విషయంలో 19, ఉద్యోగాల కల్పనలో 13, ఇమిగ్రేషన్ లో 6 నెగెటివ్ పాయింట్లు వచ్చాయని సర్వే వివరించింది.
95 శాతం మంది డెమోక్రాట్లు ట్రంప్ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేయగా.. 87 శాతం మంది రిపబ్లికన్లు ఆయన పాలనను ఆమోదించారు. అలాగే ఇండిపెండెంట్ ఓటర్లు కూడా ట్రంప్ పాలనపై విమర్శలు వ్యక్తం చేశారు. కాగా.. ఆర్థిక పరిస్థితిపై సర్వేలో పాల్గొన్నవారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి కష్టాల్లో ఉందని 70 శాతం మంది చెప్పగా.. బాగుందని 30 శాతం మంది
అభిప్రాయపడ్డారు.
