హయత్ నగర్ లో భారీవర్షం..రోడ్లపై మోకాళ్ళ లోతు వరద..భారీగా ట్రాఫిక్ జామ్

హయత్ నగర్ లో భారీవర్షం..రోడ్లపై మోకాళ్ళ లోతు వరద..భారీగా ట్రాఫిక్ జామ్

పగలంతా ఎండ..సాయంత్రానికి ఒక్కసారిగా మారిన వాతావరణం.. హైదరాబాద్ నగరంపై అప్పటికప్పుడు కమ్ముకున్న మేఘాలు.. రాత్రి7గంటల తర్వాత దంచి కొట్టిన వాన.. శుక్రవారం (సెప్టెంబర్19) రాత్రి హైదరాబాద్ నగరంలో వానబీభత్సం సృష్టించింది. సిటీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీవర్షాలతో రోడ్లు చెరువులను తలపించాయి. జనజీవనం స్తంభించింది. రోడ్లు వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

సిటీ పరిధిలోని హయత్ నగర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మెయిన్ రోడ్డు జలమయమయ్యింది. రోడ్లపై ఎక్కడ చూసినా నీళ్లే. హయత్ నగర్ మెయిన్ రోడ్డుపై మోకాళ్లోతు నీళ్లు ప్రవహించాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆఫీసులనుంచి ఇంటికి పోయే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

మరోవైపు సిటీలో పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి వర్షం పడింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది.  ప్యాట్నీ సెంటర్, పరేడ్ గ్రౌండ్,జెబీఎస్, సికింద్రాబాద్ సివిల్ కోర్టు, ఈస్ట్ మారేడు పల్లి, కార్ఖాన, డైమండ్ పాయింట్, బోయిన్ పల్లి , బేగంపేట్, రాణ్ గంజ్, పారడైజ్, సింధికాలనీ, సీతాఫల్ మండి, మెట్టుగూడ, అడ్డగుట్ట ప్రాంతాల్లో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

పాతబస్తీ లో కూడా భారీవర్షం కురిసింది. చాంద్రాయణగుట్ట,ఫలక్ నుమా, సంతోష్ నగర్, కాంచన్ బాగ్, బండ్ల గూడ, ఛత్రినాక, శాలిబండ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లపై భారీ వరదనీరు వచ్చి చేరింది. కాచిగూడ , నారాయణగూడ , కోఠి పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

ఇదిలా ఉంటే.. ఉప్పల్, నాగోల్, కప్రా, ఎల్బీనగర్, వనస్థలిపురం, హాయత్ నగర్, సరూర్ నగర్, చాంద్రాయణగుట్టలో కూడా భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.