- దమ్మయాత్ర శాంతి సందేశాన్ని చాటింది: మంత్రి వివేక్ వెంకటస్వామి
- అంబేద్కర్ఆశించిన సమాజ నిర్మాణానికి బుద్ధుని బోధనలే పునాది
- బుద్ధవనంలో దమ్మయాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు
నల్గొండ, వెలుగు: బుద్ధవనాన్ని విశ్వశాంతి కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్రంలోని బౌద్ధ క్షేత్రాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోందని తెలిపారు. ఫణిగిరి, నేలకొండపల్లి, ధూళికట్ట వంటి చారిత్రక బౌద్ధ క్షేత్రాలను బుద్ధవనంతో అనుసంధానిస్తూ టూరిజం సర్క్యూట్‌ను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
సోమవారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో నిర్వహించిన ‘3వ బుద్ధ ధమ్మ యాత్ర’ ముగింపు వేడుకలకు మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ దేశాల నుండి హాజరైన బౌద్ధ భిక్షువులను ఉద్దేశించిన జూపల్లి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలంగాణ బుద్ధుని ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతుందన్నారు. అలాగే ఆధునిక సాంకేతికత ద్వారా బుద్ధుని బోధనలను యువతకు చేరువ చేసేందుకు ఇక్కడ ఒక ‘డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్’ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
బుద్ధుని బోధనలైన కరుణ, ప్రేమ, దయ వంటి వాటిని ప్రజల హృదయాలలో తిరిగి నింపేందుకు బౌద్ధ భిక్షువులు నెలరోజుల పాటు కర్నాటకలోని కలబురిగి నుంచి తెలంగాణలోని బుద్ధ వనం వరకు నిర్వహించిన పాదయాత్ర సందేశం ఇచ్చిందని తెలిపారు. బుద్ధవనాన్ని వరల్డ్ క్లాస్ హెరిటేజ్ కేంద్రంగా మార్చుతామని, ఇక్కడ ఆరామాలు, ధ్యాన కేంద్రాలను నిర్మించడం ద్వారా బుద్ధవనాన్ని ఒక ‘విశ్వశాంతి కేంద్రం’గా తీర్చిదిద్దుతామని చెప్పారు.
బుద్ధుని బోధనలు మార్గదర్శకం: వివేక్ వెంకటస్వామి
మనిషి సాధారణ జీవితాన్ని గడిపేందుకు బుద్ధుని బోధనలు మార్గదర్శకంగా నిలుస్తాయని రాష్ట్ర కార్మిక ఉపాధికల్పన, శిక్షణ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శాంతియుతంగా, ఆశావాద దృక్పథంతో జీవితాన్ని కొనసాగించేందుకు ఉపకరిస్తాయని తెలిపారు. బుద్ధవనాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప సాంస్కృతిక వారసత్వ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉందని, బుద్ధవనాన్ని టూరిజం మాన్యుమెంట్ గా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ దమ్మ యాత్ర, శాంతి సందేశాన్ని చాటుతూ పవిత్ర నాగార్జునసాగర్ తీరానికి చేరుకోవడం సంతోషదాయకమని చెప్పారు. బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి బుద్ధుని బోధనలే పునాది అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం బౌద్ధ వారసత్వ సంపదకు కొత్త జీవం పోస్తోందని వివరించారు. బుద్ధవనాన్ని మంచి కల్చరల్, టూరిజం సెంటర్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధ స్తూపాలు కలిగి ఉన్న ప్రాంతాలలో నాగార్జున సాగర్ ఒకటని ఇలాంటి నాగార్జున సాగర్ ను గొప్ప టూరిజం సెంటర్ గా మార్చి రాష్ట్రంలో బౌద్ధాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం దమ్మయాత్రలో పాల్గొన్న 70 మంది బౌద్ధ భిక్షువులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, బుద్ధ సాంస్కృతిక అంబాసిడర్ గగన్ మాలిక్, బుద్ధ వనం స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య, ఆశ్రయ ఫౌండేషన్ అధ్యక్షుడు సిద్ధార్థ్, థాయ్ లాండ్ బౌద్ధ సన్యాసులతోపాటు వచ్చిన శ్రీలోక్ కుంథూ, ఆంజనేయ రెడ్డి, బి.చంద్రశేఖర్, నారాయణ అమిత్ తదితరులు పాల్గొన్నారు.
