- సికింద్రాబాద్ నుంచి కాగజ్‌నగర్ వరకు జర్నీ
- తోటి ప్రయాణికులతో ముచ్చట్లు.. రైలులోనే భోజనం
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం సాయంత్రం కాగజ్‌నగర్ చేరుకున్నారు. మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన మంత్రి తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. సామాన్యులతో కలిసి రైలులోనే మధ్యాహ్న భోజనం చేయడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. కాగజ్‌నగర్ చేరుకోగానే మంత్రి సభా ప్రాంగణం, హెలిప్యాడ్, పార్కింగ్ స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కాగా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కుమ్రం భీం-ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని కొత్తగూడలో తొలి విడత కింద నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి సీఎం సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొంటారు. లబ్ధిదారుల ఇళ్ల వద్ద పూజలు నిర్వహించి, పేదలకు గృహాలను అప్పగించనున్నారు. అనంతరం కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ వేదిక నుంచే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు.
