- తిరుమలగిరిలో ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి అనుచరులు
- సామేల్ వర్గీయుల రాకతో గొడవ, పరస్పర దాడులు
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఆదివారం తిరుమలగిరిలో కోమటిరెడ్డి, సామేల్ వర్గీయుల మధ్య జరిగిన గొడవ భౌతిక దాడుల వరకూ వెళ్లింది. దీంతో తిరుమలగిరిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వివరాల్లోకి వెళ్తే... మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఎమ్మెల్యే మందుల సామేల్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం కోమటిరెడ్డి వర్గీయులు తిరుమలగిరిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే మంత్రికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రెస్ మీట్ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సామేల్ అనుచరులు అక్కడికి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో ఒకరినొకరు నెట్టుకుంటూ, పిడిగుద్దులు కురిపించుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
తమపై దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోమటిరెడ్డి వర్గీయులు డిమాండ్ చేశారు. ఇదే విషయంపై సూర్యాపేట ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తిరుమలగిరిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
