కేసీఆర్ జాతిపిత ఎట్లయితడు? : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కేసీఆర్ జాతిపిత ఎట్లయితడు? : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  •     మంత్రి వెంకటరెడ్డి ప్రశ్న.

శామీర్ పేట వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ జాతిపిత ఎట్లవుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు కొల్పోయిన వారే జాతిపితలని తెలిపారు. సొంత కూతురికి న్యాయం చేయలేని వారు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని బీఆర్ఎస్ ను నిలదీశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మేడ్చల్ నియోజకవర్గం మూడు చింతలపల్లి, ఆలియాబాద్ లో ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి మాట్లాడారు. కేసీఆర్ కేవలం గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్నారే తప్ప తెలంగాణలో ఎక్కడా అభివృద్ధి చేయలేదన్నారు. 

దత్తత తీసుకున్న మూడు చింతలపల్లిని కూడా కేసీఆర్​ మర్చిపోయారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఫ్రీబస్సు పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. సభలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.