V6 News

కొప్పులా.. తప్పుకో..!

కొప్పులా.. తప్పుకో..!

జగిత్యాల,వెలుగు : తరుగు పేరిట రైతులు నష్టపోవడానికి కారణమైన మంత్రి కొప్పుల ఈశ్వర్​కు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని, వెంటనే రాజీనామా చేయాలని జగిత్యాల డీసీసీ ఆధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బస్తాకు రెండు కిలోల తరుగు తీయాలని మంత్రే అధికారులకు చెప్పారని విమర్శించారు. జిల్లా రైతులు తరుగు వల్ల రూ. 40 కోట్లవరకు నష్టపోయారని చెప్పారు. మిల్లర్లతో కుమ్మక్కయిన మంత్రి.. రైతులను ఇబ్బంది పెడితే రైస్​మిల్లులను బ్లాక్​ లిస్ట్​లో ​పెడతామని చెప్పుకోవడం ఆయన రెండు నాల్కల ధోరణికి అద్దం పడుతుందన్నారు.

ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారని, మంత్రిగానీ, టీఆర్​ఎస్​ నేతలు గానీ ఒక్క కేంద్రం దగ్గరకైనా పోలేదన్నారు. రైతుల కష్టాల గురించి మాట్లాడుతున్న జీవన్​రెడ్డి మీద విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన మంత్రికి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​కుమార్​కు సూచించారు. న్యాయం కోసం ఆందోళన చేస్తున్న లక్ష్మీపూర్ రైతుల మీద కేసులు పెట్టిన ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఎట్లా అవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్​ నేతలు బండ శంకర్, గిరి నాగభూషణం, మన్సూర్ అలి, కల్లెపల్లి దుర్గయ్య, నక్క జీవన్ తదితరులు పాల్గొన్నారు.

రాజీనామా చేయాలె: బీజేపీ నేత ఎండీ బషీర్

జగిత్యాల, (వెల్గటూరు) వెలుగు: రైతులను మోసం చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని బీజేపీ నేత ఎండీ బషీర్ అన్నారు.జగిత్యాల జిల్లా వెల్గటూరులో శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి నివాళి అర్పించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ, బస్తాకు రెండు కిలోల వడ్లు కోత పెట్టాలని మంత్రి కొప్పుల అధికారులతో మాట్లాడిన ఆడియో ప్రతి ఒక్క రైతు విన్నారని అన్నారు. కోతల వల్ల రైతులు రూ. 40 కోట్ల వరకు నష్టపోయారని, ఆ డబ్బులు తిరిగి రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు తంగళ్లపల్లి చక్రపాణి, కొమ్ము రాంబాబు, గాజుల మల్లేశం,జాడి సుజాత రాజేశం, కొత్త సంతోష్, సుధాకర్, తిరుమల చారి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం