తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ఇండస్ట్రీలకు అవసరమైన అన్ని సౌలతులు కల్పిస్తున్నామని, రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ 
కంపెనీలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సరికొత్త ఇండస్ట్రియల్ పాలసీ అమలు చేస్తున్నామని, నాణ్యమైన మానవ వనరులు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులను తెచ్చేందుకు బ్రిటన్ పర్యటనకు వెళ్లిన ఆయన బుధవారం తొలిరోజు లండన్​లో యునైటెడ్ కింగ్ డమ్ ఇండియా బిజినెస్ కౌన్సిల్(యూకే ఐబీసీ) ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు. పలు కంపెనీల ప్రతినిధులతో  సమావేశమయ్యారు. ఐటీ, బ్యాంకింగ్ ఫైనాన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, -లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో తీసుకువచ్చిన పాలసీలను కంపెనీల ప్రతినిధులకు వివరించారు. దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్​లో అసలు సిసలైన కాస్మోపాలిటన్ కల్చర్ ఉందని, రాష్ట్రంలోని కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. బ్రిటన్ అంతర్జాతీయ వాణిజ్య మంత్రి రణిల్ జయవర్దనేతో కూడా కేటీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లో నిర్వహించే బయో ఏషియా సదస్సులో పాల్గొనాలని ఆహ్వానించారు.