కాంగ్రెస్ 1000 రోజుల పాలన సూపర్ హిట్.. ఆర్థిక సంక్షోభం ఉన్న సంక్షేమం ఆపలే: మంత్రి పొంగులేటి

కాంగ్రెస్ 1000 రోజుల పాలన సూపర్ హిట్.. ఆర్థిక సంక్షోభం ఉన్న సంక్షేమం ఆపలే: మంత్రి పొంగులేటి

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన సూపర్ హిట్ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్న సంక్షేమం ఆపలేదని చెప్పారు. 2026, సెప్టెంబర్ 2తో తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ 1000 రోజలు పాలనపై బుధవారం (సెప్టెంబర్ 2) మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేదవాడికి ఉపయోగపడే పథకాలు తెచ్చామని చెప్పారు.

 గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజలకు ఉపయోగపడే కొన్ని పథకాలను కూడా యధావిధిగా కొనసాగిస్తున్నామని తెలిపారు. రైతును రాజును చేస్తామని మాట ఇచ్చాం.. చేస్తున్నామని చెప్పారు. రైతు సంక్షేమానికి లక్షా 76 వేల 50  కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. అనాటి దొర కేసీఆర్ వరి వేస్తే ఊరేనని అన్నాడు.. కానీ మేం వరి పండించిన రైతులకు బోనస్ ఇచ్చామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించిందని ఆరోపించారు.

 రూ.40 వేల 350 కోట్ల బిల్లులు పెండింగ్‎లో పెట్టారని.. మేం అధికారంలోకి వచ్చాక పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. సర్పంచులకు బకాయిలు పెట్టింది కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. అధికారం కోల్పోయిన బాధలో ప్రజలను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ గెలుస్తోంది.. 75 శాతానికి పైగా సర్పంచులు, 85 శాతానికి పైగా మున్సిపల్ సీట్లు గెలిచామని తెలిపారు. 

పొర్లు దండాలు పెట్టిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవలేదని ఎద్దేవా చేశారు. వరుస ఓటములను చూసైనా బీఆర్ఎస్ పద్దతి మార్చుకోవట్లేదని చురకలంటించారు. పదేండ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ చేయలేని పనులను మేం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కొనసాగుతోందని తెలిపారు. ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్, బీజేపీ విస్మరించాయని విమర్శించారు.