- రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
కల్లూరు, వెలుగు : అనేక ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరులో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు మంగళవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... అభివృద్ధి కేవలం కాగితాలపై కాకుండా క్షేత్ర స్థాయిలో కనిపించేలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వం పదేండ్లలో పేదలకు ఇండ్ల నిర్మాణాన్ని విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మొదటి దశలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని చెప్పారు.
త్వరలోనే రెండు, మూడు, నాలుగు దశల్లో ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించి ప్రతి అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కూల్‌ను నిర్మించి అన్ని వర్గాలు, మతాల స్టూడెంట్లు ఒకే చోట చదువుకునేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. యంగ్ ఇండియా స్కూల్‌ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఆరోగ్య రంగానికి సైతం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. రహదారి నిర్మాణ పనులకు రైతులు భూములు ఇచ్చి సహకరించాలని, వారికి ప్రత్యామ్నాయ భూములు సైతం ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఏసీపీ వసుంధర యాదవ్, డీపీవో రాంబాబు, మిషన్ భగీరథ ఈఈలు పుష్పవతి, వాణిశ్రీ, తహసీల్దార్లు బ్రహ్మేశ్వర్‌రావు, కరుణాకర్‌రావు, నాయకులు మట్టా దయానంద్, కల్లూరు ఏఎంసీ చైర్‌పర్సన్ భాగం నీర్జాదేవి, దోమ ఆనంద్‌బాబు, కల్లూరు మున్సిపల్ చైర్‌పర్సన్ ధరావత్ మోహన్, సత్తుపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ రెహనా బేగం పాల్గొన్నారు.

