- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్య
- సమాచార శాఖ వెబ్‌సైట్ ఆవిష్కరణ
హైదరాబాద్, వెలుగు: సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజలు కోరుకున్న మార్పును రెండేండ్లలోనే స్పష్టంగా చూపించి వారి విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. సోమవారం ఆయన సెక్రటేరియెట్ లో రెనోవేట్ చేసిన సమాచార శాఖ వెబ్‌సైట్ ను స్పెషల్ కమిషనర్ ప్రియాంక, సీఎం సీపీఆర్వో మల్సూర్ లతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..ఆర్థిక సంక్షోభమున్నా ఒక్కొక్క హామీని అమలు చేస్తూ ముందుకు వెళుతున్నామన్నారు. “మా నిర్ణయాలు ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పునకు నాంది పలుకుతున్నాయి.
వ్యవసాయం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం, సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఉపాధి కల్పన వరకు అన్ని రంగాల్లో చేపట్టిన సంస్కరణలు తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలుపుతున్నాయి. ఈ మార్పులను ప్రజలకు సమర్ధవంతంగా చేరవేయడంలో ప్రజా సంబంధాల శాఖ పాత్ర అత్యంత కీలకం. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని అభివృద్ది సంక్షేమ పథకాలను మరింత వేగవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి” అని సమాచార శాఖ అధికారులకు మంత్రి సూచించారు.
వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నామని, ఆర్థిక వృద్ధిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. తెలంగాణను రెండేండ్లలోనే దేశానికి రోల్‌మోడల్‌గా నిలబెట్టామని మంత్రి వెల్లడించారు.
