ఎలక్షన్ కోడ్ వల్లే హైదరాబాద్‎లో సన్న బియ్యం పంపిణీ ఆలస్యం: మంత్రి పొన్నం

ఎలక్షన్ కోడ్ వల్లే హైదరాబాద్‎లో సన్న బియ్యం పంపిణీ ఆలస్యం: మంత్రి పొన్నం

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్లే హైదరాబాద్‎లో రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ ఆలస్యమైందని హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. శనివారం (మే 3) హిమాయత్ నగర్ ఆదర్శ బస్తీలో పౌరసరఫరాల దుకాణం 602లో లబ్ధిదారులకు సన్న బియ్యం ఆయన సన్న బియ్యం పంపిణీ చేశారు. అనంతరం నారాయణగూడ గాంధీ కుటీర్ వద్ద సన్న బియ్యం లబ్ధిదారుడు ఇంట్లో భోజనం చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. భారతదేశంలో మొదటి సారి ధనవంతుడు, పేదవాడు అనే తేడా లేకుండా.. అందరూ సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాది పండగ నుంచి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయమని.. ఈ పథకం పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. 

ఎన్నికల కోడ్ వల్ల హైదరాబాద్‎లో ఏప్రిల్ నెలలో సన్న బియ్యం పంపిణీ చేయలేదన్నారు. ఈ నెల (మే) ఒకటో తేదీ నుంచి హైదరాబాద్‎లోని 653 రేషన్ షాపులలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించామని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వలేదని.. కనీసం మార్పులు చేర్పులు కూడా చేయలేదని విమర్శించారు. 

తెలంగాణ ప్రభుత్వం కుల గణన సర్వే, ప్రజా వాణి అప్లికేషన్, రెగ్యులర్‎గా ఎమ్మార్వో ఆఫీస్‎ల నుంచి వచ్చిన అప్లికేషన్‎ల ద్వారా రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ జరుగుతుందన్నారు. హైదరాబాద్ సమగ్ర అభివృద్ధిపై ముందుకు వెళ్తామన్నారు. హైదరాబాద్ ప్రజలు ఈ సన్న బియ్యం పథకాన్ని ఉపయోగించుకొని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.