సిటీలో ఢిల్లీ పరిస్థితులు రావద్దు...వీలైనంత వరకు ఎలక్ట్రిక్ వాహనాలనే వాడండి: మంత్రి పొన్నం

సిటీలో ఢిల్లీ పరిస్థితులు రావద్దు...వీలైనంత వరకు ఎలక్ట్రిక్ వాహనాలనే వాడండి: మంత్రి పొన్నం

హైదరాబాద్ సిటీ, వెలుగు :  దేశ రాజధాని ఢిల్లీ తీవ్ర కాలుష్యపు కోరల్లో చిక్కుకుందని, భవిష్యత్తులో హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి రాకూడదన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని హైదరాబాద్ జిల్లా ఇన్​చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్క్​లో జీహెచ్ఎంసీ కమిషనర్​కర్ణన్​తో కలిసి మొక్కలు నాటారు. 

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో 12 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబోయే పర్యావరణ కార్యక్రమాలను  ప్రారంభించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలైనంత వరకు ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలన్నారు.  ప్లాస్టిక్ వాడకం వల్లే నగరాల్లో డంప్ యార్డ్ సమస్యలు పెరిగిపోతున్నాయన్నారు. స్టీల్​ పాత్రలు, గ్లాస్​లు వాడాలని సూచించారు. బల్దియా కమిషనర్​కర్ణన్​మాట్లాడుతూ.. ప్రతి చిన్న పనికి వాహనాన్ని వాడడం వల్ల పొల్యూషన్ పెరుగుతుందని, నడుచుకుంటూ వెళ్లడం వల్ల ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని కాపాడొచ్చన్నారు.