బంజారాలు, ఆదివాసీలను విడదీసేందుకు బీజేపీ కుట్ర: మంత్రి సత్యవతి

బంజారాలు, ఆదివాసీలను విడదీసేందుకు బీజేపీ కుట్ర: మంత్రి సత్యవతి

ఆదివాసీలను, బంజారాలను బీజేపీ విడదీసే కుట్ర చేస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. కేంద్ర మంత్రి అర్జున్ ముండా చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. గిరిజనులకు అన్యాయం చేసే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించాలని కేసీఆర్ తీర్మానం చేసి కేంద్రానికి పంపినా.. ఆమోదం తెలపడం లేదని ఫైర్ అయ్యారు. గిరిజన బిల్లును ఆమోదం తెలిపి 9వ షెడ్యూల్ లో చేర్చి రాజ్యాంగ రక్షణ కల్పించాలని మంత్రి సత్యవతి కోరారు.   

పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం గిరిజనులను మోసం చేసిందని మంత్రి వ్యాఖ్యానించారు. గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై 2015లో చెల్లప్ప కమిషన్ నివేదిక ఇస్తే.. 2016లో కేంద్రానికి తీర్మానం చేసి పంపామని తెలిపారు. అయితే కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉందని రిజర్వేషన్లు పెంచలేమని కేంద్ర మంత్రి అర్జున్ ముండా చెప్పడం దుర్మార్గమని మంత్రి ఫైర్ అయ్యారు. గిరిజనుల బతుకులతో బీజేపీ చెలగాటం ఆడుతుందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మంత్రి సత్యవతి మండిపడ్డారు.