ములుగు జిల్లాలోపంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటన రెండవ రోజుకూడా జోరుగా సాగుతోంది. ఇవాళ జూన్ 6న జిల్లా కేంద్రంలో భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పెరుగుతున్న జనాభా, వ్యాపార అవసరాలను దృష్టిలో ఉంచుకుని... రూ. 50 కోట్ల భారీ నిధులతో నిర్మించనున్న డబుల్ రోడ్డు పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ములుగు నియోజకవర్గాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దుతామని ఆమె హామీ ఇచ్చారు. భవిష్యత్తు అవసరాల కోసం ములుగు జిల్లా కేంద్రం చుట్టూ త్వరలోనే మరిన్ని నిధులతో ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి ప్రకటించారు.
ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాయకులపై మంత్రి సీతక్క నిప్పులు చెరిగారు. రైతుల పేరుతో బీఆర్‌ఎస్ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.బీఆర్‌ఎస్ నాయకులకు నిజంగా నీతి, నిజాయితీ ఉంటే వాస్తవ సమస్యలపై మాట్లాడాలి. ప్రతిపక్షంలో ఉన్నామన్న బాధ్యత మరిచి అడ్డగోలుగా మాట్లాడటం తగదు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు సీతక్క.
