హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: వచ్చే నెల 6 నుంచి 12వ వరకు నిర్వహించనున్న కాజీపేట హజ్రత్ సయ్యద్ షా ఖాద్రీ చిష్తీ దర్గా ఉర్సు ఉత్సవాల్లో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్ లో సోమవారం ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లాస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. దర్గా రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్నందున భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలన్నారు.
ఆర్టీసీ బస్సులు, వెహికల్ పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపులు, నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. దర్గా పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు ఆగస్టు 10, 11 తేదీల్లో స్థానిక సెలవులు ప్రకటించాలని నిర్ణయించారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ ఉర్సు ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేస్తామన్నారు. సమావేశంలో దర్గా పీఠాధిపతి, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూ పాషా, అడిషనల్ కలెక్టర్ ఎన్.రవి, డీఆర్వో శ్రీనివాస్, ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మేన శ్రీను, డీఎంహెచ్వో ఏ.అప్పయ్య తదితరులు పాల్గొన్నారు.
