కాళేశ్వరం కుంగుబాటుకు హరీశ్, కేసీఆరే బాధ్యులు.. కవిత ఆరోపణలకు సమాధానం చెప్పాలి : కడియం శ్రీహరి

కాళేశ్వరం కుంగుబాటుకు హరీశ్, కేసీఆరే బాధ్యులు.. కవిత ఆరోపణలకు సమాధానం చెప్పాలి : కడియం శ్రీహరి
  •  16 వేల క్యూసెక్కుల ప్రవాహంతో నీటిని లిఫ్ట్ చేయడం అసాధ్యం 

స్టేషన్ ఘన్ పూర్, వెలుగు : కాళేశ్వరం కుంగుబాటుకు కేసీఆర్, హరీశ్ రావే బాధ్యులని, ఈ విషయాన్ని బహిరంగం ఒప్పుకోవాలని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం స్థానిక క్యాంప్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. గోదావరిలో ప్రస్తుతం కేవలం 16 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం మాత్రమే ఉందని, నీటిని ఎత్తి పోయాలంటే కనీసం 2 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండాలని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారన్నారు. 

ఎన్డీఎస్‌‌‌‌‌‌‌‌ఏ ఆదేశాల మేరకు అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయడం సాధ్యం కాదన్నారు. బీఆర్ ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోవడానికి బాధ్యులెవరన్నారు. జరిగిన దానికి బాధ్యత తీసుకోకుండా.. జరగబోయే దానికి బాధ్యత వహిస్తామనడం సిగ్గుచేటన్నారు. 

పదేండ్ల పాలనలో నోటిఫికేషన్లు ఇచ్చి వదిలేసి, పేపర్ లీకేజీలతో యువత జీవితాలతో ఆడుకున్న బీఆర్ఎస్ నాయకులు ఏ మొహం పెట్టుకుని పాదయాత్రలు చేస్తారని ప్రశ్నించారు. వర్షాభావ పరిస్థితులకు ఎల్ నినో ప్రభావమే కారణమని, సహజ సిద్ధంగా ఏర్పడిన కరువును కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించడం బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. 

బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న రూ. 1,400 కోట్లు 'క్విడ్ ప్రో కో' ద్వారా వచ్చినవేనని, ఇరిగేషన్ మంత్రిగా హరీశ్‌‌‌‌‌‌‌‌రావు అవినీతికి పాల్పడ్డారన్న కవిత ఆరోపణలకు సమాధానం చెప్పిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడాలన్నారు. దేవాదుల ద్వారా అన్ని రిజర్వాయర్లను నింపి, వారం రోజుల్లో రైతులకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అంబాటి కిషన్ రాజ్, వైస్ చైర్మన్ నీల రాజమ్మ పాల్గొన్నారు.