అడ్డగోలు ఆరోపణలు చేస్తే చెప్పు తెగుద్ది..బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సోషల్‌‌‌‌ మీడియా ప్రతినిధులపై సీతక్క ఆగ్రహం

అడ్డగోలు ఆరోపణలు చేస్తే  చెప్పు తెగుద్ది..బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సోషల్‌‌‌‌ మీడియా ప్రతినిధులపై సీతక్క ఆగ్రహం
  •  
  • సెల్‌‌‌‌ఫోన్ల కొనుగోలు పారదర్శకంగా జరిగింది
  • అంగన్​వాడీలకు ఫోన్లు ఇస్తుంటే కండ్లల్ల నిప్పులు పోసుకుంటున్నరు
  • తప్పుడు ఆరోపణలు చేసే వారిపై పరువునష్టం దావా వేస్తామని వార్నింగ్

ములుగు, వెలుగు: ప్రభుత్వ విధానాలపై ఆధారాలతో సహేతుకమైన విమర్శలు చేయాలని, అలా కాకుండా అడ్డగోలుగా నిందలు వేస్తే చెప్పు తెగుతుందని మంత్రి సీతక్క హెచ్చరించారు. శనివారం ములుగులో జరిగిన డీసీసీ కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ప్రతినిధులు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని, అవసరమైతే వారిపై పరువునష్టం దావా వేస్తానని అన్నారు. ‘‘ఎన్నికల సమయం నుంచి నన్ను టార్గెట్‌ చేసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నరు, ఇప్పుడు అంగన్‌వాడీలకు మొబైల్‌ ఫోన్లు ఇస్తుంటే కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నరు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన సందర్భంలో కూడా వీడియోలు క్రియేట్‌ చేసి అసత్య ప్రచారం చేశారన్నారు. అంగన్‌వాడీలకు ఇచ్చిన సెల్‌ఫోన్ల టెండర్లతో తమ శాఖకు సంబంధం లేదని, కేంద్రం రూ.11,800లకు కొనుగోలు చేయాలని సూచిస్తే.. తాము రూ.11,650కే కొనుగోలు చేశామని చెప్పారు. కేంద్రం సూచించిన స్పెసిఫికేషన్స్‌, రేట్ల ప్రకారం ఓపెన్‌ టెండర్‌ ద్వారా జీఈఎం పోర్టల్‌లోనే కొనుగోలు చేశామన్నారు. గతంలో వచ్చిన రూ.14 వేల టెండర్‌ను రద్దు చేశామని, ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా.. తాను స్కామ్ చేశానని ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. 

మేడారంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపాలు లేవని, అమర్చిన శిలలు సరైన పద్ధతిలో కుదరకపోవడంతో మళ్లీ పనులు జరుగుతున్నాయన్నారు. దురదృష్టవశాత్తు బాలుడికి గాయమైతే... బీఆర్‌ఎస్‌ నాయకులు దానికి కూడా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ‘నేను చావును ఎదిరించి అడవుల్లో పోరాటం చేశాను, ప్రస్తుతం ప్రజాస్వామ్యయుతంగా సేవ చేస్తున్నా, ఎటు అధికారం ఉంటే అటు పోయేటోళ్లం కాదు’ అని అన్నారు. బీఆర్‌ఎస్‌ అబద్ధాల పునాదులపై రాజకీయం చేస్తోందని, సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేసే వారిపై దీటుగా స్పందించాలని సూచించారు. వెంకటాపురంలో ప్రజాదర్బార్‌ పెట్టి సమస్యలు పరిష్కరించామని, ఈ నెల 15 నుంచి అన్ని మండలాల్లో ఆరు గ్రామాలకు ఒకచోట గ్రామ సభ నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ పోరిక బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పీసీసీ పరిశీలకుడు నాగ సీతారాములు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పీసీసీ కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చింతనిప్పుల చంద్రకళ, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోతు రవిచందర్, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కల్యాణి తదితరులు  పాల్గొన్నారు.