- దసరాలోపు ‘హ్యామ్’ రోడ్ల పనులు ప్రారంభించాలి: మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో మంజూరైన గ్రామ పంచాయతీ, గ్రామ సమైక్య, అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శనివారం పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. పనుల్లో జాప్యాన్ని ఉపేక్షించబోమని, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఒక్కో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి ఉపాధి హామీ కింద రూ.8 లక్షలు పోను, మిగిలిన రూ.4 లక్షల కోసం ఇతర నిధులను సర్దుబాటు చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.
అదనపు నిధుల కోసం ఎంపీ లాడ్స్ నుంచి కనీసం రూ.కోటి చొప్పున కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ఎంపీలందరికీ లేఖలు రాస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ‘హైబ్రిడ్ యాన్యుటీ మోడల్’ (హ్యామ్) విధానంలో చేపట్టే రోడ్ల నిర్మాణ పనులను దసరాలోపు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ దానకిశోర్, పీఆర్ కమిషనర్ దివ్య దేవరాజన్, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ శ్రుతిఓఝా, ఈఎన్సీ జగదీశ్ పాల్గొన్నారు.
అనంతరం మంత్రి ములుగు జిల్లాలోని ప్రసిద్ధ మల్లూరు లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి మంత్రి సమీక్ష జరిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలతోపాటు అభివృద్ధి పనులు చేపట్టాలని సీతక్క సూచించారు.
