బీఆర్ఎస్ ఆఫీసులో బీజేపీ బీఫామ్స్... రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం: మంత్రి శ్రీధర్ బాబు..

బీఆర్ఎస్ ఆఫీసులో బీజేపీ బీఫామ్స్... రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం: మంత్రి శ్రీధర్ బాబు..

చేవెళ్ల, వెలుగు: బీజేపీ, బీఆర్‌‌ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని, రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఐటీ, ఇండస్ట్రీస్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆరోపించారు. బీజేపీ బీఫారాలు బీఆర్‌‌ఎస్ కార్యాలయంలోనే ఇస్తున్నారని తాండూరులో బీజేపీ నుంచి బయటకు వచ్చిన ఓ నాయకుడు చెప్పినట్లు గుర్తుచేశారు. చేవెళ్లలో మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిని ఇలానే ఓడించారన్నారు. శుక్రవారం చేవెళ్లలోని కేజీఆర్ ఫంక్షన్ హాల్‌‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 

పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌‌ఎస్ ఉన్నప్పటికీ చేయలేని బీజాపూర్ హైవే పనులను తమ ప్రభుత్వం రెండేళ్లలో పూర్తి చేసే దిశగా ముందుకు తీసుకెళ్లిందన్నారు. ఎన్జీటీలో కేసు ఉపసంహరణకు కృషి చేసి పనులు ప్రారంభించామని చెప్పారు. ఈ రహదారి పూర్తి చేసిన తర్వాతే 2028 ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. 

సీఎం రేవంత్ రెడ్డికి ఈ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ ఉందని, మున్సిపల్​ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతుల అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేస్తామని మాటిచ్చారు. రాష్ట్రానికి చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు యువత కోసం ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. 

క్లీన్​ స్వీప్​ చేస్తం..

వికారాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో వందకు వంద శాతం కౌన్సిలర్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. వికారాబాద్ లో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌‌తో కలిసి ఆయన మాట్లాడారు. వికారాబాద్‌‌ను టూరిజం హబ్‌‌గా అభివృద్ధి చేయడంలో స్పీకర్ కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.