- మంత్రి శ్రీధర్‌బాబు
ఇబ్రహీంపట్నం, వెలుగు: కాలుష్య రహిత నగర నిర్మాణమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్ సమీపంలో నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ భవనాన్ని, ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంగళవారం ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అత్యాధునిక సౌకర్యాలతో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ భవనాన్ని నిర్మించామని తెలిపారు.
భవిష్యత్‌లో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే విధంగా నెట్ జీరో సిటీని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన అనుమతులు ఒకేచోట లభించేలా ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా డెవలప్‌మెంట్ అథారిటీ భవనం ప్రారంభం కానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
