- ఆవిష్కరణలకు ఊతమిచ్చే ఇన్నోవేషన్ ఎకో సిస్టం
- ‘ది హార్ట్ ఫోర్డ్ ఇండియా టెక్నాలజీ సెంటర్’ను ప్రారంభించిన మంత్రి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌ను ‘గ్లోబల్ వాల్యూ క్రియేషన్ హబ్’గా మార్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఐటీ మాత్రమే కాకుండా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, ఏరోస్పేస్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫిన్ టెక్, డీప్ టెక్, రిటైల్ తదితర రంగాల్లోనూ హైదరాబాద్‌ను గ్లోబల్ వాల్యూ క్రియేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతను ‘రెడీ టు వర్క్ ఫోర్స్’ గా తీర్చిదిద్దడం, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే గ్లోబల్ ఇన్నొవేషన్ ఎకో సిస్టం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
సోమవారం నానక్ రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అంతర్జాతీయ బీమా దిగ్గజం హార్ట్ ఫోర్డ్ 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1,200 మంది ఉద్యోగుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ‘ది హార్ట్ ఫోర్డ్ ఇండియా టెక్నాలజీ సెంటర్’ ను మంత్రి ప్రారంభించి, మాట్లాడారు. అంతర్జాతీయ విస్తరణలో భాగంగా రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన హార్ట్ ఫోర్డ్.. హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవడం ఇక్కడి ప్రతిభకు, డిజిటల్ ఇంజినీరింగ్‌లో మన నాయకత్వానికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నామన్నారు.
ఈ కేంద్రం ద్వారా ఏఐ, రిస్క్ ఇంటెలిజెన్స్‌తో కూడిన ఆధునిక బీమా రంగంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందన్నారు. సిటీలో ఇప్పటికే 400కు పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) సేవలు అందిస్తున్నాయన్నారు. ఈ జాబితాలో మారియట్, మెక్‌డొనాల్డ్స్, యూబీఎస్, డాజన్, వాన్‌గార్డ్, ఎలీ లిల్లీ, హెచ్ సీఏ హెల్త్ కేర్, సిటిజన్స్ బ్యాంక్ లాంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయన్నారు.
