పాడుబడ్డ సెక్రటేరియట్ లోనే సంసారం చేయాల్నా?

పాడుబడ్డ సెక్రటేరియట్ లోనే సంసారం చేయాల్నా?

హైదరాబాద్‌‌, వెలుగు: పాత సెక్రటేరియట్ పాడుబడిందని, అయినా అందులోనే సంసారం చేయాల్నా అని మంత్రి శ్రీనివాస్‌‌ గౌడ్‌‌ ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ఆ సెక్రటేరియట్ లో అగ్ని ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోతే బాధ్యులెవరని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నేతల వ్యవహారం తెలంగాణపై విషం చిమ్మేలా ఉందని మండిపడ్డారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌ఎల్పీలో మహబూబ్‌‌నగర్‌‌‌‌ ఎంపీ ఎం.శ్రీనివాస్‌‌రెడ్డితో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అడ్డుపడటం తప్ప కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఇంకేమీ చేతకాదన్నారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, సెక్రటేరియట్ నిర్మాణం వద్దనే వారంతా కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టేనన్నారు. సెక్షన్ 8 కామెంట్లతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ నిజస్వరూపం బయటపడిందన్నారు. గవర్నర్ అధికారాల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు తమ పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి రోజూ అక్కడి గవర్నర్‌‌‌‌తో పేచీ పడుతున్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలన్నారు. తెలంగాణకు కొత్త సెక్రటేరియట్ ఓ ప్రతీకగా మారబోతోందన్నారు. వందేళ్ల పాటు తెలంగాణ పాలనా అవసరాలను తీర్చుతుందన్నారు. పర్యావరణ నిబంధనల ప్రకారమే కొత్త సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతోందని, పూర్తయ్యాక కాంగ్రెస్ నేతల పిల్లలే అక్కడ సెల్ఫీలు దిగుతారన్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి ఒక్క ప్రాజెక్టు తేవడం చేతకాని బీజేపీ నేతలు కోతలు కోస్తున్నారని శ్రీనివాస్‌‌ గౌడ్ అన్నారు. కొత్త పార్లమెంట్‌‌పై లేని రాద్ధాంతం కొత్త సెక్రటేరియట్ పై ఎందుకన్నారు. చవకబారు విమర్శలు మానుకోవాలన్నారు.

కేసీఆర్‌‌‌‌ది బలమైన గుండెకాయ

‘సీఎం కేసీఆర్ గట్టిగా ఉన్నారు. ఆయనది బలమైన గుండెకాయ. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని మంత్రి చెప్పారు. కేసీఆర్‌‌‌‌ ఎక్కడున్నా  ఏ స్కీమ్‌‌ ఆగలేదన్నారు. ఆయన ఫామ్‌‌హౌస్‌‌ అమరావతిలో లేదని, తెలంగాణ గడ్డ మీది నుంచే రాష్ట్రాన్ని పాలిస్తున్నారన్నారు.

సెక్రటేరియట్ కూల్చుడు కాదు..ప్రజలను కాపాడండి