V6 News

ముగిసిన చేప ప్రసాదం పంపిణీ.. రెండ్రోజుల్లో 80వేల మందికి

ముగిసిన చేప ప్రసాదం పంపిణీ.. రెండ్రోజుల్లో 80వేల మందికి

హైదరాబాద్, వెలుగు: చేప్రసాదం పంపిణీ ముగిసింది. ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పంపిణీ శనివారం ఉదయం 11గంటలకు పూర్తిచేశారు. ఆ తర్వాత వచ్చిన వారిని దూద్ బౌలిలోని బత్తిన హరినాథ్ గౌడ్ నివాసానికి వెళ్లాలని సూచించారు. వారి నివాసంలో మరో రెండ్రోజుల పాటు చేపప్రసాదం పంపిణీ చేయనున్నారు.

కాగా ఇప్పటివరకు 80 వేల మందికి చేప ప్రసాదం పంపిణీ జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇంతకు రెట్టింపు పంపిణీ చేశామని బత్తిన కుటుంబసభ్యులు చెబుతున్నారు. కొందరు బయటి నుంచి చేపపిల్లలను తీసుకొచ్చి ప్రసాదంగా తీసుకున్నారు. ఆస్తమా బాధితుల కోసం బత్తిన కుటుంబసభ్యులు 175 ఏళ్లుగా చేపప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఏటా దాదాపు లక్షా50 వేల నుంచి 2లక్షల మంది వచ్చేది. అయితే  కరోనా కారణంగా మూడేళ్లుగా పంపిణీ చేయలేదు. ఈసారి పంపిణీ చేసినప్పటికీ వివిధ రాష్ట్రాల్లోని ప్రజలకు ఈ విషయం తెలియకపోవడంతోనే తక్కువ మంది వచ్చినట్లు తెలుస్తోంది. 

అందరికీ ధన్యవాదాలు: తలసాని

చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చేప ప్రసాదం పంపిణీ చేసిన బత్తిన హరినాథ్ గౌడ్, వారి ఇతర కుటుంబ సభ్యులు, జనానికి ఉచితంగా అల్పాహారం, భోజనం అందించిన స్వచ్ఛంద సంస్థలు, వలంటీర్లతో పాటు జీహెచ్ఎంసీ, పోలీస్ తదితర శాఖల అధికారులతో పాటు ఇతరులకు ధన్యవాదాలు తెలిపారు.