- కరీంనగర్లో మంత్రులతో కలిసి ఎల్‌నినో ప్రభావంపై సమీక్ష
- కలెక్టర్లు స్పష్టమైన యాక్షన్ ప్లాన్‌తో పనిచేయాలి: శ్రీధర్‌బాబు
- ఇంకుడు గుంతల నిర్మాణాన్ని తప్పనిసరి చేయాలి: పొన్నం
- రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: అడ్లూరి
కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో మంచినీటికి కూడా సమస్య వచ్చే అవకాశముందని, పంటలకు రిజర్వాయర్ల నుంచి సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదని కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో విపత్తు రాబోతున్నదని, అన్ని రంగాలపై దీని ప్రభావం పడబోతున్నదని హెచ్చరించారు. ఆదివారం మంత్రి తుమ్మల అధ్యక్షతన కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎల్ నినో ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, అధికారులు హాజరయ్యారు. సమావేశంలో ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా జిల్లాలో ప్రాజెక్టుల నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితి, తాగునీటి సరఫరా, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఆరుతడి పంటల ప్రోత్సాహం, విద్యుత్ సరఫరా, రైతులకు అవగాహన కార్యక్రమాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, వేసిన పంటలు చిన్న చిన్న జల్లులకు పండే పరిస్థితి లేదన్నారు.
అయినా రైతులు ఆశకొద్దీ బోర్లు, బావులు ఉన్న దగ్గర పత్తి, వరి లాంటి పంటలు వేస్తున్నారని తెలిపారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర రైతాంగంతోపాటు ప్రజలను అప్రమత్తం చేసేందుకు జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో వర్షాలు వస్తాయనే ఆశతో వరి నాట్లు వేయొద్దని, భూగర్భ జలాలపై ఆధారపడే రైతులు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
తాగునీటికి ఇబ్బంది రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంపై వారానికోసారి సమీక్షిస్తామని తెలిపారు. వ్యవసాయ అధికారులు ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు గ్రామ గ్రామానా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
రాజకీయాలకు అతీతంగా ఎదుర్కొందాం: మంత్రి శ్రీధర్‌బాబు
ఎల్‌నినో ప్రభావం రాష్ట్రం ముందున్న పెద్ద సవాల్ అని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రాజకీయాలకతీతంగా అందరూ కలిసి పనిచేసి రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లాల కలెక్టర్లు స్పష్టమైన యాక్షన్ ప్లాన్‌తో క్షేత్రస్థాయిలో పనిచేసి రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. రాబోయే రోజుల్లో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ధైర్యం కల్పించే విధంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని మంత్రి సూచించారు.
కరోనా స్ఫూర్తితో ఎల్‌నినోను అధిగమిద్దాం: మంత్రి అడ్లూరి
కరోనా మహమ్మారి సమయంలో అందరూ సమిష్టిగా పనిచేసి సంక్షోభాన్ని అధిగమించినట్టే.. ఇప్పుడు ఎల్ నినో కారణంగా ఏర్పడుతున్న విపత్కర పరిస్థితులను కూడా సమన్వయంతో ఎదుర్కోవాలని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. సమిష్టిగా పనిచేస్తే ఎలాంటి విపత్తునైనా అధిగమించగలమని, రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వం ప్రతి అడుగులోనూ రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, విజయ రమణారావు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కాన్ సింగ్ ఠాకూర్, సంజయ్ కుమార్, కల్వకుంట్ల సంజయ్, కరీంనగర్ మేయర్ శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మహేశ్ దత్ ఎక్కా, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, వివిధ శాఖల జిల్లా
స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టాలి: మంత్రి పొన్నం
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఉద్యమంలా చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఇంటి నిర్మాణ అనుమతులు ఇచ్చే సమయంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఇంకుడు గుంతల నిర్మాణాన్ని తప్పనిసరి చేయాలని అధికారులకు సూచించారు. దీనిని ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలన్నారు.
ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరుతడి, తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని మంత్రి కోరారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ధర్మపురి, కొండగట్టు, కాళేశ్వరం, వేములవాడ దేవాలయాల్లో వరుణ యాగాలు, ప్రత్యేక పూజలు నిర్వహిద్దామని సూచించారు.
