- అగ్రికల్చర్ ఆఫీసర్లకు మంత్రి తుమ్మల ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు తమ అనుభవాలను పొలాల నుంచే ప్రత్యక్షంగా ప్రదర్శించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం ఆయన రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి నిర్వహించారు.
నేరుగా రైతులతో మాట్లాడారు. వివిధ జిల్లాల రైతులు తమ అనుభవాలు, సమస్యలు, ప్రభుత్వ పథకాల ద్వారా పొందుతున్న లాభాలను మంత్రికి వివరించారు. యూరియా యాప్ ఎరువుల సరఫరా పారదర్శకంగా జరుగుతున్నట్లు సంతృప్తి వ్యక్తం చేశారు.జగిత్యాల జిల్లా పూడూరు గ్రామానికి చెందిన రైతు రామక్రిష్ణ తేనెటీగల పెంపకం ద్వారా అధిక ఆదాయం సాధిస్తున్నట్లు చెప్పారు.అలాగే రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు శివ ప్రకృతి వ్యవసాయం ద్వారా లాభాలు పొందుతున్నట్లు తెలిపారు. కంది కొనుగోలు కేంద్రాలతో గిట్టుబాటు ధర లభిస్తున్నదని..దీనికి మంత్రికి రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రోగ్రామ్ లో మాట్లాడిన రైతులను మంత్రి తమ్మల ప్రత్యేకంగా అభినందించారు. రైతు నేస్తం కార్యక్రమం కొనసాగుతున్న తీరును ప్రశంసించారు. ఎక్కువ మంది రైతులు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనేలా ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు రైతు నేస్తం మరింత బలోపేతం కావాలని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.
